చిత్రం చెప్పే విశేషాలు

(30-03-2024/1)

కాకినాడ జిల్లా సూర్యారావుపేట సమీపంలోని సాగర తీరంలో ‘టైగర్‌ ట్రయంప్‌’ పేరిట భారత్‌- అమెరికా దేశాల త్రివిధ దళాలు విన్యాసాలు ప్రదర్శించాయి. నేవీ విన్యాసాలు, సాహస ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. 1100 మంది సైనికులు పాల్గొన్నారు.

మెదక్‌ జిల్లాలోని శివ్వంపేటలో ఆనంద్‌రావు అనే వ్యక్తి ఇంటి పెరట్లో పనస చెట్టుకు నిఘా నేత్రాలు ఏర్పాటు చేశారు. గ్రామంలోని ప్రధాన రహదారిలోనే ఉండటంతో ఆ చుట్టుపక్కల ఏం జరిగినా తెలిసిపోతోంది.

ఆదిలాబాద్‌ జిల్లాలోని ఏజెన్సీ గిరిజన గ్రామాల ప్రజలకు వేసవి వచ్చిందంటే చాలు.. తాగునీటికి అవస్థలు తప్పడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో గ్రామానికి దూరంగా ఉన్న పొలంలోని వ్యవసాయ బావి నుంచి నువ్వుల పంటకు రైతు సాగునీరు అందిస్తుండగా అక్కడి నుంచి తాగునీరు తీసుకువస్తున్నామన్నారు.  

హైదరాబాద్‌ నగరంలో ఆహార ప్రియులను ఆకట్టుకునేందుకు వివిధ రకాల ఫుడ్‌ స్టాళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా రసూల్‌పురకు చెందిన ఓ వ్యక్తి కొంపల్లి ప్రాంతంలో ఎర్ర బస్సు కిచెన్‌ పేరుతో అందుబాటులోకి తెచ్చిన స్టాల్‌ అచ్చం ఆర్టీసీ బస్సును పోలినట్లుగా ఉంది.

ఎండలు మండుతున్నాయి. విద్యార్థులు నీట్‌ ఎంసెట్‌ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారు. ఎండ వేడికి త్వరగా అలసిపోకుండా ఎల్‌బీ నగర్‌లోని ఓ ప్రైవేటు విద్యా సంస్థ విద్యార్థుల కోసం ప్రతి గదికి ఏసీలను అమర్చింది.

అందుబాటులో జలాశయాలు లేవు.. చుట్టూ రాళ్లు, గుట్టలు తప్ప సాగునీటి కాలువలే కానరావు. అలాంటి విజయనగరం జిల్లా మక్కువ, సాలూరు ప్రాంతాల్లో గిరిజనులు ఎండలతో ఓ వైపు చెరువులు ఎండుతున్నా కొండల నుంచి వచ్చిన ఊట నీటితో వ్యవసాయం చేస్తూ అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు.  

రాజవొమ్మంగిలోని జడ్డంగిలో 516-ఈ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న భారీ వృక్షాలకు రుషి పిట్టలు ఎప్పుడూ వేలాడుతూ ఉంటాయి. చాలా ఏళ్ల నుంచి ఇలాగే ఉన్నాయని స్థానికులు అంటున్నారు. అటుగా వెళ్లేవారు ఈ చిత్రాలను తమ చరవాణుల్లో బంధిస్తున్నారు.

ఈదురుగాలులకు ఎన్నో ఏళ్ల క్రితం ఈ భారీ వృక్షం నేల కూలింది. అయినా ఓటమిని అంగీకరించలేదు. పచ్చగా చిగురిస్తూ.. పడిన చోటనే తలెత్తుకు నిలబడింది. మెదక్‌ జిల్లా శివ్వంపేట మండలం పెద్ద గొట్టిముక్ల గ్రామంలో నేలకొరిగి కాండం పూర్తిగా నేలపైన పడిన చింతచెట్టు కొమ్మలు పైకి పెరుగుతున్నాయి. 

మహబూబ్‌నగర్‌ పట్టణంలోని పెద్ద చెరువులో నిర్మించిన తీగల వంతెనను త్వరలో వినియోగంలోకి తీసుకొస్తామని గతేడాది భారాస ప్రజాప్రతినిధులు ప్రజలకు హామీ ఇచ్చారు. తర్వాత ఆ హామీని విస్మరించడం, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం మారడంతో దీనిని పట్టించుకొన్న నాథుడే కరవయ్యారు. 

మధిర మండలం ఆత్కూరు గ్రామంలో ఉన్న ఓ శీతలగిడ్డంగి వద్ద నిండినది అని బోర్డు పెట్టడంతో రైతులు మరో గిడ్డంగి వద్ద తమ ట్రాక్టర్లలో సరకును తెచ్చి ఇలా వేచిఉన్నారు. శుక్రవారం కన్పించిన దృశ్యమిది. 

సూర్యాపేట జిల్లా నూతనకల్‌ మండలం బక్కహేమ్లాతండా గిరిజన ప్రాంతం వెంట విస్తరించి ఉన్న కొమ్మాల, లోయపల్లి గుట్టల వెంట కనిపించిన దృశ్యాలివి. ఎండలకు కొండలపై చెట్లన్నీ ఎండిపోయి కళావిహీనంగా మారగా.. కింద గిరిజనులు సాగు చేస్తున్న పంట పొలాలు వరి కంకులతో కళకళలాడుతున్నాయి. 

ఓ చెలియా నా ప్రియ సఖియా..

మీకు కాఫీ నా.. టీ నా...

చిత్రం చెప్పే విశేషాలు (20-04-2024/1)

Eenadu.net Home