చిత్రం చెప్పే విశేషాలు
(31-03-2024/1)
సహజంగా సీతాకోకచిలుకలు రకరకాల రంగులతో అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. చాలావరకూ ఇవి చిన్నవిగానే ఉంటాయి. చింతపల్లిలో శనివారం ఓ ఇంటిలోపల చెక్కబల్లపై ఒక సీతాకోక చిలుక కనిపించింది. ఇది అచ్చం చెక్కబల్లపై ఉన్న రంగుల్లో తన రూపాన్ని మార్చుకుని ఉంది.
అది కృత్రిమ ఆకృతి కాదు. ప్రకృతి మలిచిన సహజమైన తీరు. చెట్టు కాండం వంపులు తిరిగి ఒక స్త్రీమూర్తి తలపై ఏదో పెట్టుకొని వయ్యారంగా నడుస్తున్నట్లుగా కనిపిస్తూ చూపరులను ఆకట్టుకుంటోంది. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని అటవీప్రాంతంలో కనిపించిన దృశ్యమిది.
ఆదివారం ఈస్టర్ పండుగ సందర్భంగా పొదలకూరు మండలం మహ్మదాపురం గ్రామానికి చెందిన విశ్రాంత చిత్రలేఖన ఉపాధ్యాయుడు పచ్చా పెంచలయ్య ఏసు ప్రభువు చిత్రాన్ని కుంకుడు ఆకుపై చిత్రీకరించారు. ఇది చూపరులను ఆకట్టుకుంటోంది.
హైదరాబాద్ నగరంలో తాగునీటి కష్టాలు తీవ్రం కావడంతో బోర్ల తవ్వకాలకు డిమాండ్ పెరిగింది. సికింద్రాబాద్ వారాసిగూడలోని బ్రాహ్మణబస్తీలో ఓ ఇంటి యజమాని బోర్‌వెల్ వేస్తుండగా అందులోంచి వెలువడిన తెల్లని పొడి ఆ ప్రాంతాన్ని కమ్మేయడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు.
గత 15 రోజుల నుంచి కుళాయిల్లో నీళ్లు సన్నటి ధారతో వస్తుండడంతో విజయవాడలోని ఆటోనగర్ గేటు ప్రాంత వాసులు ఆవేదన చెందుతున్నారు. రెండు రోజులకోసారి నగరపాలక సంస్థ వాటర్ ట్యాంకు సరఫరా చేసే నీళ్లే వీరికి దిక్కు. ట్యాంకు వచ్చినప్పుడు బిందెలతో నీళ్లు పట్టుకుని నిల్వ చేసుకుంటున్నారు.
వరంగల్ జిల్లా నర్సంపేటలోని కాకతీయనగర్‌లో రైతు మల్లయ్యకు చెందిన వ్యవసాయ బావి వద్ద శనివారం అరుదైన బార్న్ గుడ్లగూబ కనిపించింది. వింత పక్షి అంటూ స్థానికులు ఆసక్తిగా తిలకించారు. అరటి చెట్టుపై ఉన్న గుడ్లగూబను అటవీ సిబ్బంది పట్టుకున్నారు.
వరంగల్‌లోని వెంకట్రామ జంక్షన్ నుంచి కాశీబుగ్గ ప్రధాన రోడ్డు మార్గంలో చెట్లకు పూసిన పసుపువర్ణపు పూలు కనువిందు చేస్తున్నాయి. వేసవికాలంలో నిండుగా ఉండటంతో ఆ ప్రాంతం శోభాయమానంగా మారింది.
వేసవిలో అరుదుగా లభించే రాతాలం దుంపలు వేమనపల్లి, చెన్నూరు కూరగాయల సంతల్లో కనిపిస్తున్నాయి. రుచికరంగా ఉండడంతో పాటు పోషక విలువలు ఎక్కువగా ఉంటున్న వీటిని కొనుగోలు చేసేందుకు పోటీ పడుతుంటారు. కిలో రాతాలం దుంపకు రూ.50 నుంచి రూ.70 వరకు ధర పలుకుతోంది.
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి రెండు వారాలు కావస్తున్నా.. పాడేరు మండలం ఇరడాపల్లి గ్రామ పంచాయతీలో వైకాపా జెండా స్తంభం దిమ్మకు వేసిన రంగులు మార్చలేదు. మండల కేంద్రంలోని స్థానిక కొత్తపాడేరు, పాతపాడేరు వీధుల్లో రేషన్ బియ్యం సరఫరా చేసే ఎండీయూ వాహనంలో సీఎం జగన్ చిత్రాలు తొలగలేదు.
హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కు నడకదారి చుట్టూ ఉండే నెమళ్లు పగటిపూట ఎండకు చెట్లు పొదల మధ్య చేరి కనిపించడం లేదు. వేడి కాస్త తగ్గగానే ఇలా వచ్చి కనువిందు చేస్తున్నాయి.