చిత్రం చెప్పే విశేషాలు
(01-04-2024/1)
రాజకీయ ప్రముఖుడు లాల్‌కృష్ణ ఆడ్వాణీని ఆదివారం దిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ‘భారతరత్న’ అవార్డుతో సత్కరించారు. ఈ సందర్భంగా ప్రముఖ శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఒడిశాలోని పూరీ తీరంలో సైకత శిల్పం తీర్చిదిద్ది అభినందనలు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని అక్కుపల్లి గురుకుల పాఠశాల ప్రాంగణంలోని పనస చెట్టు విరగకాసింది. చెట్టు మొదలు నుంచి చివర వరకు 150పైగా కాయలతో చూపరులను అబ్బురపరుస్తోంది. సాధారణ కాపు కంటే ఇది రెండు రెట్లు ఎక్కువ.
టీఎస్ ఆర్టీసీ ఫలక్‌నుమా డిపో ఆధ్వర్యంలో ఇంజన్‌బౌలిలోని బస్టాప్‌లో కేవలం బోర్డు ఏర్పాటు చేశారు. ప్రయాణికులు కూర్చోవడానికి కుర్చీలు, షెల్టరు ఏర్పాటు చేయలేదు. ఎండకు ప్రయాణికులు నానాయాతన పడుతున్నారు.
వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం గోపల్‌దిన్నె జలాశయంలో తిలాఫియా (దూబొచ్చ) అనే రకం చేపలు సంతానోత్పత్తిని పెంచుకునేందుకు గుంతలు తవ్వుకొని అందులో గుడ్లు పెట్టి పిల్లలను పెంచుకుంటాయి. జలాశయంలో భారీగా నీటిమట్టం తగ్గడంతో చేపలు తయారు చేసుకున్న నివాసాలు ఇలా బయటపడ్డాయి.
నాంపల్లి రోడ్డులో మధ్యాహ్నం ఎండలో ఓ 80 ఏళ్ల వృద్ధురాలు అవస్థపడుతూ కనిపించింది. మాసబ్‌ట్యాంక్‌కు చెందిన డాక్టర్ అన్వర్ ఆమెకు భోజన ప్యాకెట్ అందించడంతో పాటు శీతల పానీయం తాగించి పెద్ద మనసును చాటుకున్నారు.
వరసగా బస్సులు ఉన్నాయి కాబట్టి డిపో అనుకుంటే పొరపాటు. ఆదివారం మధ్యాహ్నం డ్రైవర్లు ఆర్టీసీ బస్సులను హయత్‌నగర్‌లో జాతీయ రహదారిపై ఇలా రెండు వరసల్లో నిలిపారు. అదే సమయంలో మరో బస్సు వచ్చి ఆగడంతో రహదారి కాస్తా డిపోను తలపించింది.
క్రీడల్లో విజేతలుగా నిలవాలంటే కఠోర సాధన అవసరం. అందుకు అనుగుణంగా హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద స్కేటింగ్‌లో తర్ఫీదు పొందుతున్న చిన్నారులు తెల్లవారుజామున సచివాలయం వద్ద ఇలా కనిపించారు.
ఎండలతో మూగజీవాలు, పక్షులు దాహంతో అల్లాడిపోతున్నాయి. నాంపల్లి పబ్లిక్‌గార్డెన్‌లో ఉన్న కొలను ఎండిపోయింది. పక్షులకు నీళ్లు దొరకడం లేదు. పార్కులో గడ్డికి నీరు పట్టడంతో నిలిచిన నీటిని పక్షులు తాగుతుండగా ‘ఈనాడు’ కెమెరా క్లిక్‌మనిపించింది.