చిత్రం చెప్పే విశేషాలు
(01-04-2024/2)
మహబూబ్‌నగర్ జిల్లా వీపనగండ్ల మండలం గోపల్‌దిన్నె జలాశయంలో నీటి మట్టం తగ్గుడంతో మత్స్యకారుల వలల్లో చేపలు భారీగా చిక్కుతున్నాయి. ఆదివారం వారు వేసిన వలలకు 5 నుంచి 15 కిలోల బరువు ఉన్న చేపలు చిక్కాయి.
ఎండలు మండుతున్నాయి. భానుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. వేసవి ఉక్కపోతల నుంచి ఉపశమనం పొందడానికి నగర ప్రజలు కూలర్ల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. హనుమకొండలోని సర్క్యూట్ అతిథిగృహం రోడ్డులోని ఓ దుకాణం వద్ద వివిధ రంగుల్లో కూలర్లు ఆకట్టుకుంటున్నాయి.
చిలకలూరిపేట పట్టణంలో ఆదివారం మోడరన్ స్టెల్లార్ పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థినులు చేసిన సంప్రదాయ నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది.
ఎండాకాలంలో గ్రామాలు, పట్టణాల్లో మంచినీటి సమస్య తలెత్తడంతో నీటిని దాచుకుని వాడుకొనే పరిస్థితి నెలకొంది. ప్లాస్టిక్ బిందెలను విక్రయించేందుకు ఓ వ్యాపారి ఆటోలో ఇలా బిందెల్ని చుట్టూ కట్టి కర్నూలు జిల్లా బేతంచెర్ల ప్రధాన మార్గంలో తీసుకెళ్తున్నప్పుడు ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మన్పించింది.
తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా విభిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండగా రాత్రి వేళ ఉక్కబోత వేధిస్తోంది. తెల్లవారుజామున మాత్రం పొగమంచు కమ్మేస్తోంది. ఆకివీడు పరిసర ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి ఉదయం 8 గంటల వరకు పొగమంచు తెరలు తొలగలేదు.
కళ్యాణదుర్గం మండలం కామక్కపల్లికి చెందిన జయరాం చౌదరి నాలుగెకరాల్లో టమాటా సాగు చేశారు. పంటంతా పూతదశలో ఉంది. ఎండ తీవ్రతకు మొక్కలు మాడిపోతున్నాయి. ఇందుకు రూ.20 వేలు పెట్టి వెయ్యి పాత చీరలు కొనుగోలు చేసినట్లు తెలిపారు.
చిన్నారులు వేసిన చిత్తరువులు.. జీవకళ ఉట్టిపడేలా గీసిన చిత్రాలు పలువురిని ఆకట్టుకున్నాయి. హైదరాబాద్‌లోని చందానగర్ సరస్వతీ విద్యామందిర్ ఉన్నత పాఠశాలలో ద క్రియేటివ్ వరల్డ్ అకాడమీ ఆఫ్ డ్రాయింగ్ పెయింటింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిత్రప్రదర్శన ఆకట్టుకుంది.
కొవ్వూరు ప్రధాన రహదారికి ఒకవైపు పూర్తిగా సరిపోయేంత పడవలు శనివారం, ఆదివారాల్లో లారీలపై ప్రయాణించడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంతటి పడవలు గోదావరిలో ఇసుక డ్రెడ్జింగ్ కోసమా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు వీటిని ఎందుకు వినియోగిస్తారో తెలియాల్సి ఉంది.
మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం గుడిమల్కాపూర్ గ్రామంలో ఓ ఇంటి పెరటిలోని మామిడి చెట్టు చూపరులను ఆకట్టుకుంటోంది. గుత్తులుగా కాసిన మామిడి కాయలను చూస్తే కొమ్మలు విరుగుతాయేమో అనిపిస్తోంది. ఆ మార్గంలో వెళ్లేవారు చెట్టు నుంచి చూపు తిప్పుకోలేకపోతున్నారు.