చిత్రం చెప్పే విశేషాలు
(03-04-2024/1)
బెంగళూరు వైట్‌ఫీల్డ్‌లోని జేఎఫ్‌వీ టెక్నాలజీ సెంటర్‌లో జీఈ సంస్థ వెయ్యి డ్రోన్లతో ఆకాశంలో జీఈ ఏరోస్పేస్, హెల్త్‌కేర్, వెర్నోవా శాఖల లాంఛనాలను కనిపించేలా దీపాలను వెలిగించింది. మంగళవారం రాత్రి అవి చూపరులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
వరంగల్ జిల్లా మడికొండలోని ఓ కార్యాలయ ప్రాంగణంలో సక్యులెంట్ జాతికి చెందిన పెడిలాంథస్ టిథైమలోయిడ్స్ మొక్కకు పూసిన పూలివి. ఈ మొక్కను తెలుగు భాషలో కంచిపాల మొక్క అని పిలుస్తారని పర్యావరణ ప్రేమికుడు నాగేశ్వర్‌రావు తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లాలో అరుదైన గుడ్లగూబ జంట ప్రత్యక్షమైంది. జిల్లాకు చెందిన వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ లింగంపల్లి కృష్ణ మంగళవారం స్థానిక గాంధీ ఉద్యానవనంలో గుర్తించి తన కెమెరాలో చిత్రీకరించారు.
నల్గొండ మండల కేంద్రం ముషంపల్లి గ్రామ చెరువులోని నీళ్లన్నీ ఆవిరైపోయాయి. చెరువు కింద సాగు చేసిన పంటను కాపాడుకోవడానికి ఓ వైపు బోర్లు వేస్తుంటే.. మరోవైపు మిగిలిన ఈ గుక్కెడు నీటి కోసం తెల్ల కొంగలు నీటి చుట్టూ చేరాయి.. ఈ దృశ్యాన్ని ‘ఈనాడు’తన కెమెరాలో బంధించింది.
ఖమ్మం జిల్లా వైరానదిలో ఈసారి ఫిబ్రవరి నెల నుంచే నీటి ప్రవాహం ఆగిపోయింది. దీంతో అప్పటి నుంచి ఇసుక తవ్వకాలు జోరుగా నడిచాయి. మంగళవారం రాయపట్నం బ్రిడ్జి సమీపంలో ఎద్దుల బండ్లు ఒకే చోటికి చేరి ఇసుకను నింపుతున్న దృశ్యాన్ని ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మన్పించింది.
వాహన వేగాన్ని చూపే డిజిటల్ బోర్డుల నిర్వహణ అధ్వానంగా మారింది. రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసినా పలుచోట్ల ఇవి పనిచేయడం లేదు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 45 నుంచి దుర్గం చెరువు వెళ్లే మార్గంలోనిది ఇది.
నిత్యం 5 లక్షల మందికిపైగా ప్రయాణికులు మెట్రోలో రాకపోకలు సాగిస్తున్నారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ గాంధీ హాస్పిటల్ మెట్రో స్టేషన్‌లో పెట్టిన బోర్డు ఇది
ఎండలు మండుతున్నాయి.. పెద్దపెద్ద వృక్షాలు సైతం నిలువునా ఎండిపోతున్నాయి. హైదరాబాద్‌లోని సంజీవయ్య పార్కులో మోడువారిన ఓ వృక్షాన్ని తిరిగి చిగురింప చేసేందుకు ఓ మహిళ నీరు పెడుతూ కనిపించిందిలా..
కారణం ఏంటో కానీ అడ్డంగా నరికి వదిలేశారు. అయితేనేం నిలువెల్లా చిగురిస్తూ ఆకట్టుకుంటోంది ఓ భారీ వృక్షం. ఆఫ్జల్‌గంజ్ బస్టాండ్ వద్ద కనిపించిన చిత్రం.
సికింద్రాబాద్ మెట్టుగూడ వద్ద ఓ గోడపై వేస్తున్న వందేభారత్ రైలు బొమ్మ.. అటుగా వెళ్లే వారిని విశేషంగా ఆకట్టుకుంటోంది. పొడవైన గోడపై పచ్చని చెట్ల మధ్యలోంచి అచ్చంగా రైలు వెళ్తున్నట్లు చూపరులకు కనువిందు చేస్తోంది.