చిత్రం చెప్పే విశేషాలు
(04-04-2024/1)
కామారెడ్డి జిల్లా కేంద్ర పరిధిలోని ఇల్చిపూర్ సరస్వతీ క్షేత్రంలో ఈ నెల 9న ఉగాది సందర్భంగా ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు, సాయంత్రం 4 గంటలకు పంచాంగ పఠనం చేయనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.
కుళాయి నుంచి వస్తున్న నీటి చుక్కలతో దాహం తీర్చుకోవడానికి కపోతం ప్రయత్నించి..విజయం సాధించింది.. ఈ దృశ్యం హైదరాబాద్‌లోని తార్నాక హుడా కాంప్లెక్స్‌లో బుధవారం కంటపడింది.
విశాఖ జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ సిల్వర్ జ్యూవెలరీ స్టోర్‌ను బుధవారం బుల్లితెర నటి శ్రీముఖి ప్రారంభించారు. అనంతరం స్టోర్‌లోని వెండి ఆభరణాలను తిలకించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సరికొత్త డిజైన్లతో వందలాది ఆభరణాలు ఆకట్టుకునేలా ఉన్నాయన్నారు.
హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జూపార్క్‌లో సరస్వతి అనే పేరుగల ఖడ్గమృగం మూడు నెలల కిందట ప్రసవించింది. దానికి ప్రేమ అని పేరు పెట్టారు. నిర్వాహకుల సంరక్షణలో ఉన్న ఆ బుజ్జి ఖడ్గమృగాన్ని పది రోజుల కిందట తల్లి వద్దకు చేర్చారు.
హైదరాబాద్ నగరంలో కూలర్లకు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు మధ్య తరగతి జనం కూలర్ల బాట పట్టారు. సికింద్రాబాద్, కోఠి తదితర ప్రాంతాల్లో కనిపించిన దృశ్యాలివి.
విశాఖ జిల్లా ఏజెన్సీలో ఏ కాలంలోనైనా ప్రకృతి అందాలు కనువిందు చేస్తుంటాయి. హిమ సోయగాలు ఆకట్టుకుంటాయి. చింతపల్లి మండలం లంబసింగి ఘాట్ రోడ్డు వ్యూ పాయింట్ వద్ద ఆకులు రాలిన వృక్షం సూర్యాస్తమయంలో ఇలా కనువిందు చేసింది.
ఆదిలాబాద్ జిల్లా కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రం పరిధిలోని తాళ్లపేట రేంజి మల్యాల్ వాచ్ టవర్ ప్రాంతంలో ప్రకృతి అందాలు చూసి పర్యాటకులు మురిసిపోతున్నారు. ఎండల్లో హాయ్ హాయ్ అంటూ వారాంతాల్లో ఇక్కడికి వచ్చే వారు సఫారీ వాహనాల్లో రయ్ రయ్ మంటూ తిరుగుతున్నారు.
చార్మినార్ నుంచి మదీనా వరకు రాత్‌బజార్‌లో పర్యాటకుల సందడి నెలకొంది. రంజాన్ పండగ 8 రోజులు మాత్రమే ఉండటంతో కొనుగోలుదారులతో దుకాణాలు కిక్కిరిసిపోయాయి. వీధి దీపాల కాంతులతో జిగేల్‌మనిపించింది.
నల్గొండ మండల కేంద్రంలోని ఓ ఇంట్లో మోటారు నుంచి నీటి చుక్క కారుతుండగా.. దాన్ని ఒడిసి పట్టుకొని తాగడం కోసం ఓ కాకి తంటాలు పడుతూ కనిపించింది. ఈ చిత్రాన్ని ‘ న్యూస్‌టుడే’ క్లిక్‌మన్పించింది.