చిత్రం చెప్పే విశేషాలు

(05-04-2024/1)

సినీనటి శ్రద్ధాదాస్‌ గురువారం విశాఖ జిల్లాకు వచ్చారు. ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తాను నటించిన ‘పారిజాత పర్వం’ చిత్ర విశేషాలను వివరించారు.

రెండేళ్ల క్రితం నీటితో కళకళలాడిన చెరువులు ఇప్పుడు ఇంకిపోతున్నాయి. ఈసారి మార్చిలోనే ఎండలు మండుతుండటంతో నీరు ఆవిరైపోతోంది. దీంతో పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. హయత్‌నగర్‌ పరిధి కుంట్లూరు గ్రామంలోని పెద్దచెరువు అడుగంటి.. ఇలా నెర్రెలు చాచింది. 

హైదరాబాద్‌ నగరంలో చాలాచోట్ల బోర్లు ఎండిపోవడంతో ట్యాంకర్లకు డిమాండ్‌ పెరిగింది. జలమండలి రేయింబవళ్లు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తోంది. గురువారం బంజారాహిల్స్‌ జలమండలి రిజర్వాయర్‌ వద్ద నీటిని నింపుకొనేందుకు ట్యాంకర్లు ఇలా బారులుతీరాయి. 

వరంగల్‌ నగరంలోని ఎన్‌ఐటీలో శుక్రవారం నుంచి మూడ్రోజులపాటు వార్షిక సాంస్కృతిక వసంతోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో ఉన్న విమానం నమూనాకు రంగులు వేయడంతోపాటు విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేశారు. దీంతో నిజంగా విమానమే రోడ్డుపై దిగిందా అన్నట్టుగా అది ఆకట్టుకుంటోంది.

హైదరాబాద్‌లోని అబ్దుల్లాపూర్‌మెట్‌ సమీపంలోని గండిమైసమ్మ ఆలయం ముందున్న చెట్టును చెక్కి అమ్మవారి రూపంతో తీర్చిదిద్ది అలంకరించడంతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం జర్న పంచాయతీ చోరుపల్లికి చెందిన యువకుడు మండంగి శివ. ట్రాలీ చక్రాలను మంచానికి కట్టి తొట్టెలా ఏర్పాటు చేసి, ద్విచక్ర వాహనం వెనుక తాళ్లతో కట్టి 75 ఏళ్ల నాన్నమ్మ చిన్నమ్మాయిని ఇలా కురుపాం తీసుకొచ్చాడు.

దేశ మాజీ ఉపప్రధాని డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌ రామ్‌ జయంతి నేడు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మహ్మదాపురం గ్రామవాసి, విశ్రాంత చిత్రలేఖన ఉపాధ్యాయుడు పచ్చా పెంచలయ్య కుంకుడు ఆకుపై బాబూ జగ్జీవన్‌ రామ్‌ వర్ణచిత్రాన్ని చిత్రీకరించారు.  

బోర్లలో నీళ్లు సమృద్ధిగా ఉండడంతో ఒక వైపు వరి పంట పండుతోంది. మరో వైపు బోరు వట్టిపోవడంతో పంట ఎండిపోతోంది. (చేగుంట) నార్సింగి మండలం పెద్దతండాలో ఒక గెట్టుకు అటూ, ఇటూ ఉన్న రైతుల పొలంలో ఈ పరిస్థితి నెలకొనడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

చెరువులో ఎండిన చెట్లపై వాలిన కొంగలు, పక్షులు.. తెల్లటి పూలు పూశాయేమో అన్నట్టు కనివిందు చేస్తున్నాయి. కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి మండలం బావుపేట చెరువులో చేపల కోసం వచ్చిన పక్షులు ఇలా ఎండిన చెట్లపై వాలాయి.

నాగోలు రోడ్డులో గుడిసెవాసులు తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు. వీరికి ప్రభుత్వ నల్లా లేదు. ట్యాంకర్లు రావు. దీంతో ఈ రోడ్డులో మొక్కలకు పైపులతో అందించే నీటిని పట్టుకుంటున్నారు. ఇలా చిన్నాపెద్దా అందరూ రోడ్డు దాటి మరీ వెళుతూ నీళ్లు తెచ్చుకుంటున్నారు. 

ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పుర్‌ జిల్లా బరువా గ్రామస్థుడు బాల్‌కిషన్‌ రాజ్‌పూత్‌(64). ఆయనకు ప్రస్తుతం 24 అంగుళాల పొడవు మీసాలు ఉన్నాయి. అతడు గత 35 ఏళ్లుగా మీసాలను కట్‌ చేయకుండా పొడవుగా పెంచేశాడు.

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home