చిత్రం చెప్పే విశేషాలు

(07-04-2024/1)

అయిదేళ్లు గడిచినా వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయలేదు. ప్రకాశం జిల్లా గొట్టిపడియ వద్ద వాటర్‌గ్రిడ్‌ పంపుహౌస్‌ ఇంకా నిర్మాణంలోనే ఉంది. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాను ప్రభుత్వం నిలిపేయడంతో నిత్యం మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

చిత్రదుర్గం కోటలో వందలాది కోతులు ఎండ వేడిమిని తాళలేక విలవిల్లాడుతున్నాయి. తాగడానికి నీరు లేక, ఆహారం లభించక పట్టణంలోని నివాస ప్రాంతాలపై దాడులు చేస్తున్నాయి. వడగాల్పుల నుంచి ఉపశమనం పొందడానికి ఓ వానరం ఐస్‌క్యాండీ తింటూ ఉన్న దృశ్యం చూపరులను ఆకట్టుకుంది.

మంచిర్యాల జిల్లా బొక్కలగుట్ట శివారులోని గాంధారి ఖిల్లా ప్రాంతంలో తెల్లని వర్ణంలో మెరిసిపోతున్న ఈ చెట్టు చూపరులను ఆకర్షిస్తోంది. దీన్ని తౌషి లేదా తప్సి చెట్టు అంటారని.. బండరాళ్లను వేళ్లతో పట్టుకొని అరుదుగా పెరుగుతుందని స్థానికులు తెలిపారు.

ఎన్నడూ లేని విధంగా మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలంలోని మున్నేరు వాగు ఎండిపోయింది. దీంతో రైతులు వాగులో నీటిని చివరి బొట్టు వరకూ వినియోగించుకునేందుకు.. చెలమలు తీసి మోటార్లతో నీటిని తోడి పంటలకు అందిస్తున్నారు.

వరంగల్‌ జిల్లా ఎల్కతుర్తి మండలం దండేపల్లిలో రేణుకా ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. చివరి రోజు శనివారం గీత కార్మికులు, గౌడ సంఘం పెద్దలు పది మంది తాటిచెట్టు ఎక్కి చుక్క కల్లు కింద పడకుండా జాగ్రత్తగా తీసి ఆలయంలో అమ్మవారికి సమర్పించారు. 

కర్నూలు నగరం దాహార్తి తీర్చే ప్రధాన నీటి వనరైన సుంకేసుల జలాశయం అడుగంటిపోతోంది.దీంతో తాగునీటి ఇబ్బందులు తప్పడంలేదు. నగరంలోని చెన్నమ్మ సర్కిల్‌ వద్ద వేసిన బోర్ల వద్ద నీటికోసం ట్యాంకర్లు బారులు తీరుతున్నాయి. 

దీన్ని తారు రోడ్డు అనాలో..! లేక కంకర రోడ్డు అనాలో తెలియని దుస్థితి. గుడివాడ నియోజకవర్గం పరిధిలోని గుడ్లవల్లేరు - పెంజెండ్ర గ్రామాల మధ్య రహదారి దయనీయ స్థితి ఇది. సుమారు నాలుగు కిలోమీటర్ల పొడవు ఉండే ఈ మార్గం మొత్తం తారు పోయి కంకర మిగిలి ఇలా వాహనదారులకు పరీక్ష పెడుతోంది. 

రోజురోజుకు పెరుగుతున్న ఎండలకు ప్రజలు బెంబేలెత్తుతున్నారు. దుకాణాల్లో కూరగాయలు ఎండ వేడికి మాడిపోతున్నాయి. కరీంనగర్‌లోని జ్యోతినగర్‌లోని ఓ మహిళ తాను విక్రయించే కూరగాయలపై నీటిలో తడిపిన గోనె సంచులు ఇలా కప్పింది.

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలో పలు గ్రామాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. కానీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో కొన్ని చోట్ల తాగునీరు వృథా అవుతోంది. బూర్జపాడు, ఈదుపురం, కొఠారి, తేలుకుంచి, హరిపురం, కొళిగాం గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడే లీకై భారీగా వృథాగా పోతోంది.

కర్ణాటక రాష్ట్రం కలబురగిలో ఉష్ణోగ్రత పెరిగిపోతోంది. పోలీసు శాఖలో పని చేస్తున్న జాగిలాలకు ఎండ తీవ్రత నుంచి రక్షణ కల్పించేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. వాటి కాళ్లకు ప్రత్యేక బూట్లు తయారు చేశారు. అవి విశ్రాంతి తీసుకునే గదిలో ఎయిర్‌ కూలర్లు ఉంచారు. 

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home