చిత్రం చెప్పే విశేషాలు
(12-04-2024/1)
తిరుమల శ్రీవారిని సినీనటి అంజలి గురువారం దర్శించుకున్నారు. ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ చిత్రబృందంతో కలిసి వచ్చిన ఆమెతో స్వీయచిత్రాలు దిగేందుకు పలువురు ఆసక్తి చూపారు.
ఈనెల 17న శ్రీరామనవమిని పురస్కరించుకొని కళాకారులు ధూల్‌పేటలో శ్రీరాముడి భారీ విగ్రహాలు తయారు చేస్తున్నారు. నగరంతో పాటు వివిధ జిల్లాల నుంచి విగ్రహాల కొనుగోలుకు బుకింగ్ చేసుకుంటున్నారని తయారీదారులు చెప్పారు.
ఉత్తర్ ప్రదేశ్‌లోని మధురకు చెందిన రాజ్‌వీర్ జనం వద్దకే వెళ్లి చెరకు రసం విక్రయించేందుకు వీలుగా సెకండ్ హ్యాండ్ మోటార్ సైకిల్‌తో సంచార చెరకు రసం బండిని తయారుచేయించారు. ఎల్‌బీనగర్ నాగోల్‌లో చెరుకు రసం విక్రయిస్తూ కనిపించారు.
దక్షిణ కన్నడ జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ఓటర్ చైతన్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా మంగళూరుకు సమీపంలోని పణంబూరు వద్ద సముద్ర తీరంలో స్వీప్ సమితి ఆధ్వర్యంలో మరబోట్లపై ఊరేగుతూ.. ప్రజలను అప్రమత్తం చేయడానికి సాహసికులు ఇలా సిద్ధమయ్యారు!
భూగర్భ జలాలు అడుగంటి.. బోర్ల నుంచి సన్నటి ధార మాత్రమే వస్తోందని రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిత్తాపూర్‌కు చెందిన మహిళా రైతు పద్మ తెలిపారు. దీంతో ఎకరం పొలంలో సగానికి మాత్రమే నీరు అందుతోందని, మిగతా సగం ఎండిపోయిందని వాపోయారు.
ఈ చిత్రంలో కనిపిస్తున్నవి ఇప్ప చెట్లు. మార్చి వరకు ఈ చెట్ల ఆకులన్నీ రాలిపోయి ఉగాది నాటికి కొత్త ఆకులు వస్తాయి. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచిప్ప అటవీ ప్రాంతంలో ఉన్న ఈ రెండు ఇప్ప చెట్లు ఊదా, ఆకుపచ్చ రంగుల్లో ఇలా కనిపించాయి.
రేడియేషన్, ఇతర కారణాలతో అంతరించిపోతున్న పిచ్చుకలు, పక్షులను సంరక్షించేందుకు తన వంతుగా కృషి చేయాలని భావించి.. వాటికి తన ఇంట్లో ఆవాసాలు ఏర్పాటు చేశారు నిజామాబాద్ వినాయక్‌నగర్‌లోని కొత్త హౌసింగ్ బోర్డుకు చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి అందె జీవన్‌రావు.
ముస్లిం సోదరులు గురువారం రాష్ట్రవ్యాప్తంగా ‘ఈద్-ఉల్-ఫితర్’ (రంజాన్) పండగ జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ శిల్పి సుదర్శన్ పట్నాయక్ పూరీ తీరంలో సైకత శిల్పం తీర్చిదిద్ది ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు.