చిత్రం చెప్పే విశేషాలు

(15-04-2024/1)

శ్రీక్రోధి నామ నూతన సంవత్సర తమిళ ఉగాది(కేరళ విషు) పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం వరంగల్‌లోని శ్రీధర్మశాస్త్ర భక్త సేవాశ్రమంలో అయ్యప్ప స్వామికి అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామిని గజమాలలతో సుందరంగా అలంకరించి, మంగళహారతులు ఇచ్చారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్‌ భద్రాచలంలోని సీతమ్మవారికి రంగులు మారే త్రీడీ చీరను రూపొందించారు. 5.5 మీటర్ల పొడవు, 48 అంగుళాల వెడల్పు ఉన్న దీని బరువు 600 గ్రాములు. 18 రోజులు శ్రమించి బంగారు, వెండి, ఎరుపు వర్ణాలతో తయారు చేశారు.

మహబూబ్‌నగర్‌ జిల్లా కోయిలకొండ మండలం దమాయపల్లి గ్రామంలో 15 ఎకరాల్లో విస్తరించిన గణపతిరాయుని చెరువు ఇది. దీని కింద 150 ఎకరాల ఆయకట్టు ఉంది. ఏటా మండు వేసవిలోనూ ఇందులో ఎంతో కొంత నీరుండేది. ఈసారి మాత్రం ఇలా చెరువులో చుక్కనీరు లేకుండా ఎండిపోయి నెర్రెలిచ్చింది. 

అసలే వేసవి కాలం..ఆపై ఆదివారం.. పాఠశాలలకు సెలవు కావడంతో ఈత కొలనుల వద్ద చిన్నారులు సందడి చేశారు. నల్గొండ శివారు పానగల్‌ ఫిల్టర్‌బెడ్‌ అవుట్‌ వాటర్‌ సంపు నీటిలో ఈదులాడుతూ.. కేరింతలు కొట్టారు.

గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌ ఏసీపీ కార్యాలయం ఎదుట అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన లేజర్‌షో చూపరులను ఆకట్టుకుంది.  

వేసవి దృష్ట్యా తన ఆటోలో ప్రయాణించే వారికి చల్లదనం పంచేందుకు మహబూబాబాద్‌ జిల్లా దర్గాతండాకు చెందిన ఆటోవాలా అంజి వినూత్నంగా ఆలోచించారు. ఆటో కప్పుపై ఇనుప ప్లేటు అమర్చి.. దానిపై మట్టిపోసి గడ్డిపూల మొక్కలు పెంచుతున్నారు. ఎండకు మొక్కలు వాడిపోకుండా.. వాటిపై పరదా ఏర్పాటు చేశారు. 

రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి వేడుకలు హైదరాబాద్‌ నగర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, పలు పార్టీల నేతలు, వివిధ సంఘాల నాయకులు ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఉప్పల్‌ రింగురోడ్డులో వేగంగా వెళ్తున్న ఆర్టీసీ సిటీ బస్సును ఎక్కేందుకు ఓ యువకుడు పరుగులు తీశాడు. బస్సు వేగంగా వెళ్తోంది. అయినప్పటికీ ఆగకుండా వేగంగా వెళ్తున్న వాహనాల మధ్యలో నుంచి పరుగు తీస్తూ ఆర్టీసీ బస్సును అతి కష్టం మీద ఎక్కుతూ ‘న్యూస్‌టుడే’ కెమెరాకు చిక్కాడు.

ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం రాచూరులో కనిపించిన ఈ దృశ్యాలు చూపరులను ఆకర్షిస్తున్నాయి. పదిరోజులుగా ఈ కోతి పిల్లిపిల్లను ఎత్తుకొని లాలిస్తోంది. తల్లినుంచి తప్పిపోయిన పిల్లిపిల్లను కోతి చేరదీసి ఆహారం పెడుతూ ఎక్కడలేని మమకారం చూపుతోందని స్థానికులు తెలిపారు.

ప్రపంచాన్ని తలకిందులుగా చూద్దామా!

వినూత్నంగా చెప్పిన విశ్వక్‌సేన్‌..

చిత్రం చెప్పే విశేషాలు (17-05-2024/1)

Eenadu.net Home