చిత్రం చెప్పే విశేషాలు

(18-04-2024/1)

శ్రీరామ నవమి సందర్భంగా భారీ హనుమంతుడి పెయింటింగ్‌ సామాజిక మాధ్యమాల్లో ఆకట్టుకుంటోంది. చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలం చిన్నపర్తికుంట గ్రామానికి చెందిన కళాకారుడు పురుషోత్తం 25 అడుగుల వెడల్పు, 20 అడుగుల పొడవుతో వేసిన పెయింటింగ్‌ అందరినీ ఆకట్టుకుంటోంది.

వరంగల్‌ జిల్లా నర్సంపేటలోని మాదన్నపేట చెరువులో మత్స్యకారులు చేపలు పడుతుండగా వలకు 30 కిలోల బరువున్న మొసలి చిక్కింది. మత్స్యకారులు దాన్ని అటవీశాఖ అధికారులకు అప్పగించగా.. వారు ఖానాపురం మండలంలోని పాకాల సరస్సులో దాన్ని వదిలిపెట్టారు. 

శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా నిర్మల్‌ గ్రామీణ మండలం కౌట్ల(కె) గ్రామ రామాలయం వద్ద థర్మాకోల్‌తో తయారు చేసిన హనుమాన్‌ రూపం ఆకట్టుకుంది. మాలధారులు తయారు చేసిన ఆ విగ్రహాన్ని డ్రోన్‌కు జతచేసి ఆలయం చుట్టూ వినూత్నంగా ప్రదక్షిణలు చేయించడంతో భక్తులు, స్థానికులు ఆసక్తిగా తిలకించారు.

కరీంనగర్‌ జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని చైతన్యనగర్‌కు చెందిన గుండు భాగ్యలక్ష్మి అనే బీటెక్‌ విద్యార్థిని రావి ఆకుపై శ్రీరాముడి చిత్రాన్ని గీసింది. ఉడతతో ఆడుకుంటున్నట్లు ఉన్న చిత్రం ఆకట్టుకుంటోంది.  

శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ ఒడిశాలోని పూరీ తీరంలో రఘురాముని సైకత శిల్పాన్ని తీర్చిదిద్ది శుభాకాంక్షలు తెలిపారు. 

హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజాలో ఏర్పాటు చేస్తున్న ఎగ్జిబిషన్‌ ముఖ ద్వారాన్ని లండన్‌ టవర్‌ బ్రిడ్జి తరహాలో తీర్చిదిద్దుతున్నారు. ఇది చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. 

యాదగిరిగుట్ట గండి చెరువు వద్ద సూర్యాస్తమయానికి భానుడు విద్యుత్తు టవర్ల మధ్య వెలిగిపోతూ సందర్శకులకు కనువిందు చేశాడు. గోదావరి జలాలతో నిండిన చెరువు, చుట్టూ పచ్చిక ఆహ్లాదం కలిగిస్తోంది. సముద్ర తీరంలోని లైట్‌హౌస్‌ను తలపిస్తోందని భక్తులు తెలిపారు.

సాధారణంగా శునకం, వానరం విరోధులు. కానీ ఏన్కూరు మండలం ఆరికాయలపాడులో కొన్ని రోజులుగా కోతి, కుక్క జాతివైరం మరిచి చెట్టాపట్టాలేస్తున్నాయి. ఒకదానితో ఒకటి ఆటలాడటం, కలిసి నడవడం వంటి దృశ్యాలను ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మనిపించింది. 

అయోధ్య రామ జన్మభూమికి సంబంధించిన తపాలా బిళ్లలు ఖమ్మం స్టేషన్‌ రోడ్డులోని ప్రధాన తపాలా కార్యాలయంలో అందుబాటులోకి వచ్చాయి. రామ మందిరానికి చెందిన ఆరు ప్రముఖ చిత్రాలతో ఆరు తపాలా బిళ్లలు ఉన్నాయి. మొత్తం సెట్‌ రూ.వందకు తపాలా కార్యాలయంలో విక్రయిస్తున్నారు.

అసలే ఎండలు మండి పోతున్నాయ్‌.. ఆపై బతుకుదెరువు కోసం చిన్నారులతో కలిసి మండుటెండలో బొమ్మలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. నల్గొండ జిల్లా శాలిగౌరారంలో బొమ్మలు అమ్మేందుకు వచ్చిన వలస జీవులు తమ చిన్నారులతో బొమ్మల నీడ మాటున బతుకు పోరు సాగిస్తున్నారు. 

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home