చిత్రం చెప్పే విశేషాలు
(20-04-2024/1)
విశాఖ జిల్లా సింహగిరిపై అప్పన్న వార్షిక తిరు కల్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి శోభాయమానంగా జరిగింది. ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు, దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తి కొబ్బరికాయలు కొట్టి రథయాత్రను ప్రారంభించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో బ్రిల్లార్ క్లినిక్ మొదటి వార్షికోత్సవం వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు సినీ తారలు లక్ష్మీ మంచు, రెజీనా కసాండ్రా, దర్శకుడు బుచ్చిబాబు, రేణుకా చౌదరి, బిగ్‌బాస్ ఫేమ్ భాను, అఖిల్, ఆరియాన తదితరులు పాల్గొని సందడి చేశారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా అధినేత నారా చంద్రబాబు జన్మదిన వేడుకలను ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కుప్పం పురపాలక పరిధిలోని నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సామగుట్టపల్లెలో పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్‌చేశారు.
హైదరాబాద్ నగరంలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. రాజేంద్రనగర్, సరూర్‌నగర్, నాగోల్, చైతన్యపురి, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, చిక్కడపల్లి, బాగ్‌లింగంపల్లి, ఖైరతాబాద్, లక్డీకాపూల్, తార్నాక, ఓయూ క్యాంపస్, ఉప్పల్, తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.
ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. శుక్రవారం ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. సాయంత్రం ఉరుములు..మెరుపులతో చిరుజల్లులు పడ్డాయి. ఉరుములతో కూడిన మెరుపు ఆకాశంలో కనువిందు చేయగా ‘న్యూస్‌టుడే’ క్లిక్ మనిపించింది
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. బంధుమిత్రుల సమక్షంలో వైభవంగా ఈ వివాహం జరిగింది. గ్వాలియర్‌లోని న్యూ బ్రజ్ విహార్ కాలనీలో నివసించే శివాని పరిహార్‌కు చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడంటే అమితమైన భక్తి, ప్రేమ.
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప లోక్‌సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టరేట్‌లో ఆర్వోకు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఆమె వెంట వివేకా కుమార్తె సునీత ఉన్నారు. అంతకుముందు ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద షర్మిల నివాళి అర్పించారు.
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను హైదరాబాద్‌లో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. హైటెక్ సిటీ సైబర్ టవర్స్ వద్ద ఐటీ ఉద్యోగులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ‘హ్యాపీ బర్త్‌డే సీబీఎన్’ అంటూ నినాదాలు చేశారు.
హైదరాబాద్ రాయదుర్గంలోని ఓ ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ విద్యార్థులు ర్యాంప్‌పై మెరిశారు. ఎఫ్‌డీడీఐ క్యాంపస్‌లో 3వ గ్రాడ్యుయేషన్ ఫ్యాషన్ షోలో విద్యార్థులు రూపొందించిన ఫుట్‌వేర్ డిజైన్, ఫ్యాషన్ డిజైన్, లెదర్ డిజైన్ ఉత్పత్తులు ఆకట్టుకున్నాయి.