చిత్రం చెప్పే విశేషాలు
(25-04-2024/1)
హైదరాబాద్‌లోని లాల్‌దర్వాజా మహంకాళి గుడి ఎదురుగా తాగునీటి వాల్వు లీకేజీ అయ్యి నీరు వృథాగా పోతోంది. విలువైన జలాన్ని సంరక్షించాల్సిన అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
నిజామాబాద్ - ఆర్మూర్ ప్రధాన రహదారి పక్కన దాస్‌నగర్ వద్ద నందిపేటకు వెళ్లే మూలమలుపులో భారీ వృక్షాలను నరికేశారు. అందులో ఓ వృక్షం ఇలా మళ్లీ చిగురిస్తోంది. మనం ఎత్తుకు ఎదిగినా.. ఒక్కోసారి కింద పడతాం. అందుకు కుంగిపోవాల్సిన పనిలేదు. అందుకు సజీవ సాక్షమే ఈ చిత్రం.
యాసంగి పంటగా సాగు చేసిన వేరుశనగను వ్యవసాయ కూలీలు ఇలా గొడుగుల నీడలో సేకరిస్తున్నారు. ఇంద్రవెల్లి, ఉట్నూరు మండలాల సరిహద్దులోని పొలంలో వ్యవసాయ కూలీలు ఇలా ఎండ నుంచి రక్షణగా వేరుశనగను సేకరిస్తుండగా ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మనిపించింది.
వాహనదారులు రహదారులపై ప్రయాణించేటప్పుడు కనీస రక్షణ చర్యలు తీసుకోవడం లేదు. హయత్‌నగర్‌లో ద్విచక్ర వాహనంపై కొబ్బరి మట్టలను ప్రమాదకరంగా తీసుకెళ్తూ బుధవారం కనిపించారిలా..
సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ నామినేషన్ దాఖలు సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ సమయంలో ఎండ తీవ్రత అధికంగా ఉంది. కార్యక్రమం ముగిసిన అనంతరం పాల్గొన్న వారికి జేబీఎస్ రోడ్డులో పార్టీ ప్రతినిధులు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.
ట్యాంక్‌బండ్ పైకి వచ్చే సందర్శకుల్లో రోడ్డు దాటేవారి కోసం జీబ్రా లైన్లు, పెలికాన్ సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేసినా కొందరు పట్టించుకోవడం లేదు. వాహనాల రద్దీ ఉన్న సమయంలో ఎక్కడంటే అక్కడ ఇలా పిల్లలతో రోడ్డు దాటడం ప్రమాదాన్ని కోరి తెచ్చుకోవడమే.
మహబూబాబాద్ జిల్లాలో మూడేళ్ల క్రితం భర్త కొవిడ్‌తో మృతి చెందడంతో ఒంటరిగా మారిన ఓ మహిళ తీవ్ర మానసిక వేదనకు లోనైనా ఓ దృఢ సంకల్పానికి వచ్చారు. భర్త రూపం ఎప్పటికీ కళ్లముందే కనిపించేలా.. ఆయన నిలువెత్తు విగ్రహం తయారు చేయించి గుడి కట్టించారు.
రోజంతా కష్టపడితే గానీ పూటగడవని చిరువ్యాపారులు వారు. వేసవిలో గొడుగులు సైతం వేడిని తట్టుకోకపోవడంతో తడిపిన గోనె సంచులను అడ్డుగా కప్పి అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ దృశ్యం మెదక్ పట్టణంలోని కూరగాయల మార్కెట్ బయట కనిపించింది.