చిత్రం చెప్పే విశేషాలు

(02-05-2024/1)

తేనెటీగలకు కూడా దప్పిక ఉంటుందనే ఈ చిత్రం ‘ఈనాడు’ కెమెరాకు చిక్కింది. ఆదిలాబాద్‌ జిల్లా బేల మండలం దుబ్బగూడ పంచాయతీ టేమ్రిగూడలో భగీరథ పైపులైన్‌ నుంచి కారుతున్న నీటిని తాగేందుకు తేనెటీగలు ఇలా మంచి నీటి కుళాయి చుట్టూ చేరాయి.  

నటుడు అజిత్‌కుమార్‌ తన 53వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సతీమణి, నటి షాలిని రూ.23లక్షల ఖరీదైన బైక్‌ను కానుకగా అందించారు. అజిత్‌కుమార్‌కు విలాసవంతమైన కార్లు ఉన్నా ఆయనకు బైక్‌లపై ఆసక్తి ఎక్కువ. ఆయన బైక్‌ ప్రియుడు కావడంతో ఈ ఖరీదైన కానుక షాలిని అందించారు.

గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండల కేంద్రంలోని అద్దంకమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవం ప్రారంభమైంది. గ్రామంలోని ప్రధాన కోడలిలో అమ్మవారి విగ్రహానికి మహిళలు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు సంప్రదాయంగా గ్రామోత్సవం నిర్వహించారు.

ఎన్నికల్లో పంపిణీ చేయడానికి అక్రమంగా నిల్వ ఉంచిన రూ.80 లక్షల విలువైన 58,032 క్వార్టర్ల గోవా మద్యం సీసాలను కృష్ణా జిల్లా పోలీసులు బుధవారం ధ్వంసం చేశారు. చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై పొట్టిపాడు టోల్‌ప్లాజా సమీపంలో రోడ్‌ రోలర్‌తో ఈ సీసాలను తొక్కించారు. 

ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ నుంచి 170 మందితో బుధవారం మధ్నాహ్నం 1.45 గంటలకు దిల్లీకు ప్రయాణమైన విస్తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ప్రమాదానికి గురైంది. అకస్మాత్తుగా మేఘాలుకమ్ముకొని గాలివానతో వడగళ్లు పడడంతో విమానం రెక్కలు దెబ్బతిన్నాయి.

ఎండలు తీవ్రరూపం దాల్చడంతో సలక జీవరాశులు ఇబ్బందిపడుతున్నాయి. పలుచోట్ల జలవనరులు నీరులేక ఎండిపోయాయి. తమిళనాడులోని కడలూర్‌ జిల్లా కెడిలం చెరువు, పొన్నై నది పరివాహక ప్రాంతాల్లోని చెరువుల్లో కొద్దిపాటి నీరు ఉంది. ఆ ప్రాంతాలకు పక్షులు గుంపుగా వచ్చి దాహార్తి తీర్చుకుంటున్నాయి.

రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు యువకులు, చిన్నారులు నల్గొండ జిల్లా చండూరు మండల పరిధిలోని శిర్థేపల్లి గ్రామంలో ఓ బావిలో నీరు పుష్కలంగా ఉండడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈత కొడుతూ సేద తీరుతున్నారు. 

నల్గొండ జిల్లా మర్రిగూడ మండల కేంద్రంలోని ఓ రైతు తన తోటలో కాసిన మామిడి కాయలను చీడ పురుగుల నుంచి రక్షించుకునేందుకు సంచులు తొడిగారు. దీని ద్వారా దిగుబడి పెరుగుతుందని ఆ రైతు పేర్కొంటున్నాడు. దీనిని ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మనిపించింది. 

ఓటుహక్కు వినియోగంపై ప్రజల్లో చైతన్యం కల్పించడానికి ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రచారం చేస్తున్నారు. ఈ మేరకు సంస్థకు చెందిన ఆటోకు ప్రచార నినాదాలతో కూడిన ఫ్లెక్సీ బిగిస్తున్నారు. కరీంనగర్‌లోని మంకమ్మతోటలో కనిపించిందీ దృశ్యం.

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home