చిత్రం చెప్పే విశేషాలు

(15-05-2024/1)

సికింద్రాబాద్‌ భారాస ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్‌ తెలంగాణ లోక్‌ సభ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడిపారు. ఎన్నికలు ముగిసిన తర్వాత తన మనవరాలిని సరదాగా ఆడిస్తూ ఇలా కనిపించారు.

హైదరాబాద్‌ ఐమాక్స్‌ సమీపంలో కుండల్లో చల్లని మజ్జిగ, రాగిజావను వాహనదారులకు విక్రయిస్తున్న తల్లి దుర్గ పక్కనే కూర్చుని చదువుకుంటున్న ఈ బాలిక పేరు శిరీష. తండ్రి లేకపోయినా తల్లి ఆసరాతో చదువుపై శ్రద్ధ చూపుతోంది. 

ఎర్రటి ఎండలతో ఠారెత్తించిన భానుడు.. వరుణుడి కరుణతో రెండ్రోజులుగా ఓరుగల్లు నగరంలో కొంచెం చల్లబడ్డాడు. ఆకాశం అప్పుడప్పుడు మేఘావృత్తమై ఆహ్లాదం కలిగిస్తోంది. చిత్రకారుడు గీసిన చిత్రంలా కాకతీయ యూనివర్సిటీ మైదానం వద్ద కనిపించిన దృశ్యాన్ని ‘న్యూస్‌టుడే’ క్లిక్‌ మనిపించింది.

కొన్ని నెలలుగా మన్యంలో సంచరిస్తున్న ఏనుగుల గుంపు ఇటీవల నాగావళి నది దాటి కొమరాడ మండలంలోని కళ్లికోట, దుగ్గి పరిసర ప్రాంతాలకు చేరుకుంది. సమీప పంట భూముల్లో తిరుగుతూ సేదదీరుతున్నాయి. వేసవి నేపథ్యంలో ఏనుగులు తరచూ నాగావళిలోకి దిగుతూ సందడి చేస్తున్నాయి.

సాధారణంగా పుట్టలు అయిదు నుంచి ఏడడుగుల ఎత్తులో ఉంటాయి. విశాఖ జిల్లా రాజవొమ్మంగి - అప్పలరాజుపేట వెళ్లే మార్గంలో రహదారి పక్కనే దాదాపు 8 నుంచి 10 అడుగుల ఎత్తులో ఉన్న పుట్ట అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. అటుగా వెళ్లేవారు దీన్ని ఆసక్తిగా తిలకిస్తున్నారు. 

చెట్టు కొమ్మలకు ఆకులు అల్లుకుని గుత్తులుగా కనిపిస్తున్నట్లు అనిపిస్తోంది ఈ చిత్రం. చెట్టు కొమ్మల్లో డ్రిప్‌ పైపులు భద్రపరిచారు. అవి కొమ్మలకు అంటుకుని ఆకుల్లా కనిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లా హిమాంనగర్‌లో కనిపించిన ఈ దృశ్యాన్ని ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మనిపించింది. 

ఎండా కాలంలో ఆలస్యంగా సూర్యాస్తమయం చూస్తుంటాం. ఆదిలాబాద్‌ జిల్లా లక్ష్మణచాంద మండలం వడ్యాల్‌ వద్ద సాయంత్రం 7.30 గంటల సమయంలో కూడా సూర్యుని కాంతి కొనసాగింది. ఒకవైపు నేలపై చీకటి కమ్ముకోగా.. ఆకాశంలో భానుడి కాంతి చూపరులను ఆకట్టుకుంది.  

విశాఖ జిల్లా మన్యంలో వేసవిలోనూ మంచు కురుస్తోంది. లంబసింగి పరిసర ప్రాంతాల్లో నాలుగు రోజులుగా ఉదయం, సాయంత్రం వేళల్లో మంచు.. మధ్యాహ్నం వరకు ఎండ ఠారెత్తించి, సాయంత్రం వరకు వర్షం కురుస్తోంది.

ఏప్రిల్, మే నెలల్లో చెట్లు ఆకులు రాలి నిర్జీవంగా కనిపిస్తాయి. అయితే ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో విశాఖ జిల్లా మన్యంలో చెట్లు చిగురించి పచ్చదనం సంతరించుకుంది. ఎక్కడ చూసినా ఆహ్లాదంగా కనిపిస్తోంది. మండలంలోని రింతాడలో ఇలాంటి పచ్చని అందాలు ‘న్యూస్‌టుడే’కు చిక్కాయి.  

ప్రకృతి అందాలు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పెరికసింగారం వేణుగోపాలస్వామి ఆలయ ఆవరణలో  లేత ఎరుపు ఆకుల వర్ణంలో ఓ చెట్టు చిగురింపు దశలో ఉండగా.. మరొకటి లేలేత ఆకుపచ్చ రంగుతో చిగురిస్తూ రెండు రావిచెట్లు కంటికింపుగా కనిపిస్తున్నాయి.

ప్రపంచాన్ని తలకిందులుగా చూద్దామా!

వినూత్నంగా చెప్పిన విశ్వక్‌సేన్‌..

చిత్రం చెప్పే విశేషాలు (17-05-2024/1)

Eenadu.net Home