చిత్రం చెప్పే విశేషాలు
(18-05-2024/1)
1947 సెప్టెంబరు 2న నిజాం పాలనకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో పోలీసుల కాల్పుల్లో 13 మంది ఉద్యమకారులు అమరులయ్యారు. దీనికి స్మారక చిహ్నంగా వరంగల్ జిల్లా పరకాలలో నిర్మించిన అమరధామం వద్ద ఉద్యమకారుల విగ్రహాలు ఉద్యమ పంథా వైపు సాగున్నట్లు ఇలా సరికొత్తగా కనిపించాయి.
పలు అంతర్జాతీయ సంస్థలు ఉద్యోగులు కాసేపు నిద్రపోతే మరింత సమర్థంగా విధులు నిర్వహిస్తారనే ఆలోచనతో తమ కార్యాలయాల్లో న్యాప్‌ప్యాడ్ యంత్రాలను ఏర్పాటు చేశాయి. హైదరాబాద్‌లోని నార్సింగిలో జరిగిన తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ కౌన్సిల్ జాతీయ సదస్సులో దీన్ని ప్రదర్శించాయి.
ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న తమ కుమార్తెను హాస్టల్‌లో చేర్పించేందుకు హైదరాబాద్ నగరానికి వచ్చిన కుటుంబం ఇది. భర్త చేతికి గాయమై కట్టు ఉండటంతో ఆ మహిళ తన కుమార్తె ట్రంకు పెట్టెను మోస్తూ వెళుతున్న ఈ దృశ్యం హైటెక్ సిటీ వద్ద కనిపించింది.
హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన సింపన్న రమేష్ దంపతులు రెండు ఎకరాలను కౌలుకు తీసుకుని వరి సాగు చేశారు. కురిసిన భారీ వర్షానికి ధాన్యమంతా తడిసిపోయింది. కొంతైనా కాపాడుకుందామనే తాపత్రయంతో ఇలా ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్నారు.
ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లాలో ఆకాశంలో మేఘాలు అద్భుతంగా కనిపించి అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రతి ఒక్కరు ఆ దృశ్యాలను చరవాణిలో బంధించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. మేఘాలు ఎరుపు రంగులలో సౌందర్యంగా కనిపించి చూపరుల మనసు దోచేశాయి.
తెలంగాణ ఉద్యమకారుడు గోసుల శ్రీనివాసయాదవ్ పత్రికా వ్యాసాల సంకలనం భూమి పుత్రుడు(సన్ ఆఫ్ ది సాయిల్) పుస్తకాన్ని మెదక్ జిల్లా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. మాజీ మంత్రి టి.హరీశ్‌రావు తదితరులు ఉన్నారు.
చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని కౌండిన్య అభయారణ్యంలో అరుదైన కప్పను హైదరాబాద్‌కు చెందిన జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు గుర్తించారు. శ్రీలంక తడిభూముల్లో మనుగడ సాగించే శ్రీలంక బ్యాక్డ్ ఫ్రాగ్ (కప్ప) జాతి దేశంలో రెండు శతాబ్దాల క్రితమే కనుమరుగైందని వారు తెలిపారు.
రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షంతో రోడ్లపై గుంతల్లో నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. నీరు వెళ్లే మార్గం లేకపోవడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ అడుగులో అడుగేస్తూ వరద దాటుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. ఎన్టీఆర్‌గార్డెన్, నిమ్స్ ఆసుపత్రి వద్ద కనిపించిన అవస్థలివి.
ఇది పంట భూమి కాదు.. గుండ్లకమ్మ జలాశయం. నీటి నిల్వలు అడుగంటడంతో బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం ఎర్రబాలెం సమీప రైతులు జలాశయంలో గడ్డి సాగు చేస్తున్నారు. పొలాల వరకూ నీరందకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నేరుగా జలాశయంలోనే సాగు చేపట్టారు.