చిత్రం చెప్పే విశేషాలు

(19-05-2024/1)

ఒడిశాలోని పర్లాఖెముండి పట్టణంలోని గజపతి క్రీడామైదానం ప్రాంతంలో గల దామోదర్‌ బిహార్‌ కాలనీలో నివసిస్తున్న సిగ్మా మిశ్రా ఇంట్లో మే పుష్పం వికసించింది. మే నెలలో మాత్రమే వికసించే అరుదైన ఈ పుష్పాన్ని పలువురు తమ చరవాణిలో బంధించారు.

వరంగల్‌ జిల్లా ఖానాపురం శివారులోని పాత వంతెన సమీపంలోని మిషన్‌ భగీరథ పైపులైన్‌ పగిలిపోవడంతో నీరు ఉవ్వెత్తున పైకి లేచింది. ఆకాశాన్ని తాకుతున్నట్లుగా తెల్లని నురగలతో ఉప్పొంగడంతో స్థానిక యువకులు స్వీయ చిత్రాలు తీసుకుంటూ సందడి చేశారు. 45 నిమిషాల పాటు తాగునీరు వృథాగా పోయింది.

అమ్మో బాపు గారి బొమ్మో... ఓలమ్మో మల్లెపూల కొమ్మో... అని యువత మదిలో గిలిగింతలు రేపిన... ప్రముఖ నటి ప్రణీత విజయవాడలో సందడి చేసింది. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆమె చిరునవ్వులతో.. చూపరులను కట్టిపడేసింది.

వేసవి కాలం వచ్చిందంటే చిన్నారులు కాలికి బంధం వేసుకొని, కొడవలి నోటితో కరుచుకొని చకచకా తాటి చెట్టు ఎక్కి గెలలు కోసేవారు. కృష్ణా జిల్లా పమిడిముక్కలలో ఓ యువకుడు జేసీబీని తీసుకొచ్చి.. దానికి ఊయల కట్టి అందులో కూర్చొని తాటికాయలు కోస్తున్న దృశ్యం ‘న్యూస్‌టుడే’ కెమెరాకు చిక్కింది.

పట్టాలపై నడవాల్సిన రైలు బండి రోడ్డుపై వెళ్తూ చూపరులను ఆకట్టుకుంది. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తూ అనంతపురం జిల్లా రాప్తాడు మండలం రామినేపల్లి వద్ద రోడ్డుపై కనిపించిన ఈ టైర్ల రైలును వాహనదారులు ఆసక్తిగా గమనించారు.

కాళేశ్వరం పథకంలో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద నిర్మించిన పార్వతి(సుందిళ్ల) బ్యారేజీ నుంచి నీటిని దిగువన గోదావరిలోకి వదలడంతో జలాశయం వెలవెలబోతోంది. ప్రస్తుతం ఇసుక, మట్టిదిబ్బలతో దర్శనమిస్తోంది.

మల్కాజిగిరి, తూర్పుఆనంద్‌బాగ్‌ డివిజన్ల పరిధిలో కురిసిన వర్షానికి కాలనీల్లోని రహదారులు జలమయం అయ్యాయి. కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లేవారు వానలో తడిసిపోయారు. రహదారి పక్కన చిరువ్యాపారులకు రక్షణ లేక ఇబ్బందిపడ్డారు.

అందాల తార రాశీఖన్నా హైదరాబాద్‌ నగరంలో సందడి చేసింది. బంజారాహిల్స్‌లోని ఓ నగల దుకాణానికి విచ్చేసిన ఆమె విభిన్న రకాల డిజైన్ల ఆభరణాలను ధరించి హొయలు పోయింది. 

విశాఖ జిల్లా పాండురంగాపురంలో ఓ వ్యక్తి తన ఆటోను ఇలా పచ్చదనంతో చూడచక్కగా మార్చారు. ఆటో బయట, లోపల మొక్కల కుండీలు ఏర్పాటు చేశారు. ఆటో చుట్టూ, పైన పచ్చదనం నిండేలా ప్రత్యేక మ్యాట్‌ కుట్టించారు. సాధారణ ఆటోలకన్నా భిన్నంగా..ప్రయాణికులను ఆకర్షించేలా ఉంది ఈ ఆటో.  

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home