చిత్రం చెప్పే విశేషాలు
(20-05-2024/1)
విశాఖ జిల్లా రాజవొమ్మంగిలో విచిత్ర వాతావరణ పరిస్థితి నెలకొంది. ఉదయం ఆకాశం ఎర్రటి, పసుపు వర్ణంలో అందంగా ఉంది. మధ్యాహ్నం నీలపు నింగిలో తెల్లని మేఘాలతో, సాయంత్రం బంగారు వర్ణపు ఆకాశంలో నల్లని మబ్బులతో కనువిందు చేసింది. ఒకే రోజు నింగిలో ఈ మార్పులు చూసిన ప్రజలు మైమరిచిపోయారు.
కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి కల్యాణ మహోత్సవం కన్నులపండువగా జరిగింది. ఈ కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని విద్యుత్తు దీపకాంతులతో సుందరంగా అలంకరించారు.
సామాజిక మాధ్యమాల్లో లైకుల కోసం బైకులతో కొందరు ఆకతాయిలు పలు విన్యాసాలు చేన్నారు. వీరి చేష్టలతో మిగతా ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల వరంగల్ జిల్లా ఖిలావరంగల్‌కోట ప్రధాన దారిలో కనిపించిన దృశ్యమిది.
గిజిగాడు పక్షులు సాధారణంగా సామూహికంగా ఎత్తుగా ఉన్న చెట్లపై గూడు కట్టుకుంటాయి.చెట్టుకు పదుల సంఖ్యలో వేలాడే ఆ గూళ్లు చూపరులను ఆకట్టుకుంటాయి. మెదక్ జిల్లా సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలోని ఎల్లమ్మ గుడి వద్ద ఈత చెట్టుకు ఉన్న గిజిగాడి గూళ్లు ఆకట్టుకుంటున్నాయి.
విశాఖపట్నం జిల్లా చింతపల్లి మండలం లంబసింగి సమీపంలోని చెరువులవెనంలో మంచు అందాలు పర్యటకులను అబ్బురపరిచాయి. మన్యంలో కొద్దిరోజులుగా భిన్నమైన వాతావరణం నెలకొంటోంది. దూరప్రాంతాల నుంచి పర్యటకులు వచ్చి ఇక్కడి మంచు అందాలను ఆస్వాదిస్తున్నారు
కర్నూలు: కర్నూలు జిల్లా డోన్ సమీపంలోని భారత్ డాబా వద్ద లారీపై రైలు ఇంజిన్‌ను బెంగళూరు నుంచి హైదరాబాద్ జాతీయ రహదారిపై తరలిస్తుండగా న్యూస్‌టుడే క్లిక్‌మనిపించింది. లారీనెక్కిన రైలింజన్ అంటూ అటువైపుగా వెళ్లే ప్రయాణికులు ఆసక్తిగా తిలకించారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నార్నే కూడలిలో సుందరీకరణలో భాగంగా తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి షాపింగ్ చేసి ఒకరి చేతిని మరొకరు పట్టుకొని వస్తున్న బొమ్మలను జీహెచ్‌ఎంసీ అధికారులు ఇక్కడ ఏర్పాటు చేశారు. అవి జీవం ఉట్టిపడేలా ఉండడంతో అందరినీ ఆకట్టుకున్నాయి.
విశాఖ జిల్లా పాడేరు పట్టణంలో ఆదివారం ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం వర్షం కురవడంతో మేఘాలు కమ్ముకున్నాయి. కొండల నడుమ విస్తరించిన మంచు మేఘాలు ఆకట్టుకున్నాయి. ఇంద్ర ధనస్సు విరిసి చూపరుల మది దోచుకుంది.
భూగర్భ జలాలు ప్రమాదకరంగా అడుగంటిన ప్రస్తుత తరుణంలో ఖమ్మం గ్రామీణం మండలం చిన్నతండాలోని ఈ వందేళ్ల చరిత్ర కలిగిన పురాతన బావిలో స్థానికులు పదుల సంఖ్యలో మోటార్లను ఏర్పాటు చేసి నీటిని తరలించుకుంటున్నారు.
విశాఖ జిల్లా ఎటపాక మండలంలోని నెల్లిపాక, చోడవరం గ్రామ సమీపంలో ఆకాశంలో మేఘాలు కనువిందు చేశాయి. చూడటానికి భూమి నుంచి ఆకాశంలోకి వెళ్తున్నట్లుగా కనిపించిన ఆ దృశ్యం చాలా అందంగా కనిపించటంతో ప్రజలు ఆసక్తిగా తిలకించారు.