చిత్రం చెప్పే విశేషాలు
(23-05-2024/1)
నంద్యాల పట్టణం కోట వీధిలోని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచామృత అభిషేకాలు, అర్చనలు చేశారు. భక్తులు భక్తిశ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతమాచరించారు.
ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురిసిన వేళ హరివిల్లు విరిసి ప్రజలను మురిపించింది. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లెలో ఓ వైపు చిటపట చినుకులు పడుతుంటే.. మరో వైపు మేఘాలపై ఏర్పడిన ఇంద్రధనుస్సు చూపరులకు కనువిందు కల్గించింది.
‘అహింసా పరమో ధర్మః ’ అన్న బుద్ధభగవానుడి జయంతి సందర్భంగా నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మహ్మదాపురం గ్రామవాసి విశ్రాంత చిత్రలేఖన ఉపాధ్యాయుడు పచ్చా పెంచలయ్య రావి ఆకుపై బుద్ధుడి వర్ణచిత్రాన్ని చిత్రీకరించారు.
నీటిలో చేపల వేటకు ఉపయోగించే తెప్పలే ఎండకు ఛత్రమయ్యాయి. ఏపీలోని రాజమండ్రి నుంచి మత్స్యకారులు తమ సామగ్రితో సహా సూర్యాపేటకు లారీలో వెళుతూ ఖమ్మం జిల్లా కల్లూరులో ఆగారు. లారీలో రెండు తెప్పలను గొడుగు మాదిరిగా ఏర్పాటు చేసి నీడలో ఉన్న ఈ దృశ్యాన్ని ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మన్పించింది.
ఒకటీ రెండూ కాదు.. పదుల సంఖ్యలో జేసీబీ యంత్రాలు వరుసగా కన్పించడంతో జనం ఆసక్తిగా తిలకించారు. విజయవాడ వైపు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న ఓ గూడ్సురైలుపై వాటిని తరలిస్తుండగా.. ఖమ్మం జిల్లా మధిర రైల్వే స్టేషన్‌లో కొద్దిసేపు ఆగింది.
హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లోని లోటస్‌పాండ్ రెండో పార్కులో ఏర్పాటు చేసిన డైనోసార్ బొమ్మలు ధ్వంసమవుతున్నాయి. పార్కులో నిర్వహణ కొరవడడంతో పలుచోట్ల బొమ్మలు విరిగిపోయాయి.
హైదరాబాద్‌లోని 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం చెంత ఏర్పాటుచేసిన మేళాను చిన్నారులు రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. మేళాలో కశ్మీర్ మంచు కొండల్లో మంచు కురవడం, అక్కడి జంతువులు, నివాస సముదాయాలను కళ్లకు కట్టినట్లు రూపుదిద్దిన తీరు సందర్శకులను అలరిస్తోంది.
హైదరాబాద్‌లో అడపాదడపా కురుస్తున్న అకాల వర్షాలతో పాటు ఎండలూ మండిపోతున్నాయి. నగర శివారు పెద్ద అంబర్‌పేట వద్ద నిర్మాణ పనుల్లో పాల్గొంటున్న కార్మికులు తాటి మట్టలతో స్వయంగా టోపీలు తయారు చేసుకుని ఎండ నుంచి ఇలా రక్షణ పొందుతూ కనిపించారు.
హైదరాబాద్ నగర శివారు కుంట్లూరులోని ఓ వ్యవసాయ క్షేత్రంలో బంగారు వర్ణ వడ్రంగి పిట్టలు కనిపించాయి. దట్టమైన అడవుల్లో మామిడి, మద్ది, కొబ్బరి వంటి పొడవైన చెట్ల బెరడు తొలచి పురుగుల్ని ఆహారంగా తీసుకుంటాయి. ‘ఈనాడు’ కెమెరాకు చిక్కిన చిత్రమిది.