చిత్రం చెప్పే విశేషాలు

(25-05-2024/1)

కారును కడగడానికి పైపు ఏర్పాటు చేశారని అనుకుంటే పొరపాటే. కరీంనగర్‌ కమాన్‌ సమీపంలోని హౌసింగ్‌బోర్డు రోడ్డులో పబ్లిక్‌ కుళాయి పగిలి.. ఇలా నీరు విరజిమ్మింది. పక్కనే కారు నిలిపి ఉంచడంతో ఆ నీరు దానిపై పడింది. లీకేజీలను సరి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

చూసే కళ్లు, స్పందించే హృదయం ఉండాలే కానీ అల్లూరి జిల్లాలో సహజసిద్ధ అందాలకు కొదవలేదు. ఏ చిత్రకారుడో తన కుంచెతో గీసినట్లు ఉన్న ఈ దృశ్యం చింతపల్లి- నర్సీపట్నం మార్గంలోని లోతుగెడ్డ కూడలి సమీపంలో ‘న్యూస్‌టుడే’ కెమెరాకు చిక్కింది. 

చీపురు పుల్లలా, ఎండుటాకులా కనిపిస్తున్న ఈ కీటకం చెట్టు బెరడు రంగులో కలిసిపోయిది. విశాఖ జిల్లా చీడికాడ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉన్న బాదం చెట్టుపై పాకుతుండగా ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మనిపించింది. దీన్ని గొల్లభామగా పిలుస్తారని స్థానికులు పేర్కొన్నారు. 

విశాఖ జిల్లా రుషికొండ బీచ్‌రోడ్డులోని ఒక హోటల్‌ సమీపంలో పనస చెట్టు విరగకాసింది. ఈ చెట్టుకు పనసకాయలు అధికంగా కనిపిస్తుండడంతో స్థానికులు, సందర్శకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.  

వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట మండలం కేశవపల్లిలో వ్యవసాయ బావులు అధికంగా ఉన్నాయి. రాతి కట్టడాలతో ఆకట్టుకుంటున్నాయి. నీళ్లు సమృద్ధిగా ఉండడంతో విద్యార్థులు ఈత కొడుతున్నారు. ఎండలు మండుతుండడంతో గంటల తరబడి జలకాలాటలతో సేదదీరుతున్నారు. 

 రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల్‌ గ్రామంలోని సహదేవి సముద్రం చెరువులో 20 కిలోల భారీ మీనం మత్స్యకారుల వలకు చిక్కింది. ఇరవై కిలోల బరువున్న చేపలు ఎక్కువ సంఖ్యలో వలకు చిక్కడంతో మత్స్యకారులు సంబరపడ్డారు. 

 ‘శక్తి’ పథకానికి వినియోగిస్తున్న బస్సుల్లో ఎక్కువ శాతం మరమ్మతుల పాలయ్యాయి. కొన్ని బస్సుల పైకప్పులకు రంధ్రాలు పడ్డాయి. ప్రయాణంలో ఉన్నప్పుడు వర్షం కురవడంతో తడవకుండా ఉండేందుకు ఇలా గొడుగు వేసుకుని ఆర్టీసీ డ్రైవరు బస్సు నడిపారు. ఈశాన్య కర్ణాటక విభాగంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

జామకాయలు సహజంగా వంద నుంచి 150 గ్రాముల మధ్యన బరువుంటాయి. విశాఖ జిల్లా నక్కపల్లిలో ఓ దుకాణదారుడు తన బండిపై విక్రయానికి తెచ్చిన కాయల్లో కొన్ని చాలా భారీ సైజులో ఉన్నాయి. ఇవి ఒకొక్కటి అర కేజీకిపైగా తూగడం విశేషం. 

విశాఖ జిల్లా ఎన్‌ఏడీ కూడలి వద్ద సింహాచలం కొండల మీదుగా నాలుగు గంటల సమయంలో దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. వేసవి వేడి గాలులకు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న నగరవాసులకు కాస్త ఉపశమనం దక్కింది. అయితే...వర్షం కురుస్తుందని ఆశించినా... వరుణుడు కరుణించలేదు. 

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home