చిత్రం చెప్పే విశేషాలు
(26-05-2024/1)
విశాఖ నగరంలో పక్షుల సంరక్షణపై ఆసక్తి ఉన్నవారు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. పక్షులకు ప్రత్యేకంగా కొబ్బరి పీచుతో తయారు చేసిన గూళ్లను కొని తమ ఇళ్లల్లో, పెరట్లలో అమర్చుతున్నారు. కొందరైతే తమ అభిరుచికి తగినట్లు వివిధ రూపాల్లో గూళ్లు తయారు చేయించుకుంటున్నారు.
కాకినాడలో ప్రధాన పైపులైను మరమ్మతుల కోసం మూడు రోజుల నుంచి నీటి సరఫరాను నిలిపివేశారు. దీంతో రాజీవ్‌గృహ సముదాయాలు, టిడ్కో గృహాలు, దుమ్ములపేట, పర్లోపేట, సంజయ్‌నగర్, అయోధ్యనగర్ తదితర ప్రాంతాల్లో ఒక్క ట్యాంకర్ రాగానే.. తాగునీటి కోసం వందలమంది బిందెలతో వస్తున్నారు.
హనుమకొండ పద్మాక్షి కాలనీలోని శ్రీహనుమద్గిరి ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండోరోజు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. 408 కిలోల లడ్డూ ప్రసాదం, కృత్రిమ మంచు పొగతో స్వామి వారికి మహా నైవేద్యం సమర్పించారు.
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ శివారులోని చిన్న చెరువులో మత్స్యకారులు గత వారం రోజులుగా చేపలు పడుతున్నారు. వారి వలకు సుమారు 13 కిలోల బరువున్న బొచ్చె రకం చేప చిక్కింది. దాన్ని ఒడ్డుకు తెచ్చాక పలువురు చరవాణుల్లో బంధించారు. అనంతరం విక్రయించడానికి మార్కెట్‌కు తీసుకెళ్లారు.
ఏడాదిలో మే నెలలో మాత్రమే మే పుష్పాలు వికసిస్తాయి. చిత్తూరు జిల్లాలోని కల్లూరు మండలంలోని మంగళంపేట గ్రామానికి చెందిన మునిరాజ ఇంట్లో మే పుష్పాలు వికసించాయి. మే పుష్పాలతో స్వీయచిత్రాలు దిగి స్థానికులు మురిసిపోతున్నారు.
ఉభయ రాష్ట్రాల రైతులు ఆమ్‌చూర్‌ను నిజామాబాద్ మార్కెట్ నుంచి ఉత్తరాదితో పాటు, విదేశాలకు ఎగుమతి చేస్తారు. 361 క్వింటాళ్ల పంటకు గరిష్ఠంగా క్వింటా రూ.35,500, సగటు ధర రూ.23 వేలు, అత్యల్పంగా రూ. 9 వేలు పలికింది. ఉత్తర భారతంలో చింతపండుకు ప్రత్యామ్నాయంగా ఆమ్‌చూర్‌ను వినియోగిస్తారు.
శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం పెద్దదూగాం సమీపంలో తాటిచెట్లపై కొంగలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఉదయం మేతకు తిరిగి అలసిపోయిన పక్షులు ఎండ తీవ్రతకు మధ్యాహ్న సమయంలో ఒక్కో చెట్టుపై ఒక్కో పక్షి సేదతీరుతున్న దృశ్యం ‘న్యూస్‌టుడే’ కెమెరాకు చిక్కింది.
కురిసిన వర్షాలకు చింతచెట్లు చిగురించాయి. చిగురును కోసేందుకు చిన్నాపెద్దా వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఖమ్మం జిల్లా తల్లాడ 108 కార్యాలయం సమీపంలో ఓ చిన్నారి సైకిల్‌పై కూర్చొని పట్టుకోగా మరో చిన్నారి ఎంచక్కా చిగురు అందుకుంది. ఈ దృశ్యాన్ని ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మనిపించింది.
అమెరికాకు చెందిన డయానా ఆర్మ్‌స్ట్రాంగ్ అనే మహిళ ప్రపంచంలోనే అత్యంత పొడవైన గోళ్లు కలిగిన మహిళగా గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్నారు. ఆమె చేతి వేళ్లకు 1,306.58 సెం.మీ (42.87 అడుగుల) పొడవైన గోళ్లు ఉన్నట్లు ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్’ ప్రతినిధులు తెలిపారు.