చిత్రం చెప్పే విశేషాలు

(29-05-2024/1)

చెరకు రసం బండి లాగుతున్న ఈ యువతి పేరు రూప. హైదరాబాద్‌లోని మలక్‌పేటలో ఐటీఐ చదువుతోంది. తండ్రి మేస్త్రీ. ఖాళీ సమయంలో ఇలా కుటుంబానికి చేదోడుగా నిలుస్తోంది. ఘట్‌కేసర్‌ రోడ్డులో సెల్‌ఫోన్‌లో ఆన్‌లైన్‌ పాఠాలు వింటూ బండి లాగుతూ కనిపించింది.

విశాఖ జిల్లా పాయకరావుపేటకు చెందిన చిత్రకారుడు గీచిన తెదేపా అధినేత చంద్రబాబు చిత్రం ఆకట్టుకుంటోంది. ‘మ్యాన్‌ ఆఫ్‌ మిలీనియం’ అంటూ చిత్రకారుడు పి.లవరాజు అద్భుతంగా తీర్చిదిద్దారు. జీవకళ ఉట్టిపడేలా పెన్‌ స్క్రిబ్లింగ్‌ విధానంలో బాల్‌ పాయింట్‌ పెన్నుతో చక్కగా చిత్రీకరించారు. 

మామిడి పళ్ల సీజన్‌ ప్రారంభం కావడంతో పక్షులు, చిన్న ప్రాణులకు తగినంత తిండి లభిస్తోంది. కర్ణాటకలోని చిక్‌మగళూరు ప్రాంతాల్లో మామిడి పండ్లు విరగ్గాశాయి. పసందైన ఓ మామిడి పండును ఉడత లాగిస్తూ న్యూస్‌టుడే కెమెరాకు చిక్కింది. 

జీవన పోరాటంలో భాగంగా ఓ వృద్ధుడు ప్రమాదకర ప్రయాణం సాగిస్తున్న దృశ్యం ఇది. నిజామాబాద్‌ చుట్టు పక్కల గ్రామాల్లో ఓ వృద్ధుడు పనికి రాని ఇనుప వస్తువులను కొనుగోలు చేసి ఇలా మోతాదుకు మించి తన ద్విచక్ర వాహనంపై కష్టంగా తీసుకెళ్తుండగా.. ‘ఈనాడు’ క్లిక్‌మనిపించింది.

హైదరాబాద్‌ కేబీఆర్‌ ఉద్యానం ఎదుట ‘స్టాప్‌ ఈటింగ్‌ టు ఎక్స్‌టింక్షన్‌: గో వీగన్‌’ పేరుతో అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు డైనోసార్ల వేషధారణలో.. జీవహింస చేసుకుంటూ పోతే భూమిపై ఏ జంతువు మిగలదని, శాకాహారమే శ్రేయస్కరమని అవగాహన కల్పించారు.

వేసవి కాలం రైళ్లు రద్దీగా వెళుతున్నాయి. వీటిలో ఎక్కేందుకు ప్రయాణికులు సాహసిస్తుంటారు. అందుకు నిదర్శనం ఈ చిత్రం. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని రైల్వే స్టేషన్‌లో నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఓ వైపు కదులుతున్నా, ప్రయాణికులు ఎక్కుతున్నారు. 

ప్రకృతి స్థితిని బట్టి నెమలి పులకిస్తే చూపరులకు కనువిందే. మెదక్‌ జిల్లా సిద్దిపేట శివారులోని కొండపాక మండలం మర్పడ్గ ఆక్సిజన్‌ ఉద్యానంలో వన్యప్రాణులు సందడి చేస్తున్నాయి. చల్లటి సాయంత్రం వేళలో నెమళ్లు పులకించి పురివిప్పాయి. 

ప్రముఖ పర్యాటక ప్రాంతమైన వైఎస్‌ఆర్‌ జిల్లాలోని గండికోటలో శతాబ్దాల చరిత్ర కలిగిన ఎర్రకోనేరు ఎండిపోయింది. 900 ఏళ్ల చరిత్ర కలిగిన గండికోటలో ఈ కోనేరూ అంతే పురాతనమైంది. తీవ్ర వర్షాభావంతో నీరు లేక కోనేరు ఎండిపోయింది.

విశాఖపట్నం తీరంలో సముద్రపు అలల ఉద్ధృతి  ఎక్కువగా కనిపించింది. ఆర్కే బీచ్‌లో సుమారు రెండు వందల అడుగుల మేర కెరటాలు ముందుకొచ్చాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకూ సాగరం ఇలా ‘అల’జడి సృష్టించింది.

ఖమ్మం జిల్లా పెనుబల్లి బీసీ కాలనీలోని ఓ అంతర్గత రహదారిలో సిమెంట్‌ రోడ్డు వేశారు. ఆ రోడ్డులో మరమ్మతులకు గురైన చేతి పంపును తొలగించలేదు. ఇప్పుడు మరమ్మతులు చేసినా.. ఆ పంపు నుంచి నీళ్లు పట్టుకోలేని పరిస్థితి నెలకొంది.

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home