చిత్రం చెప్పే విశేషాలు (30/05/2024-1)

జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నగరంలో చేపట్టిన వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు సందడిగా కొనసాగుతున్నాయి. నెలన్నరపాటు చిన్నారులు తమకు ఇష్టమైన ఆటల్లో శిక్షణ పొందారు. క్రికెట్, టెన్నిస్, బాస్కెట్‌బాల్, స్కేటింగ్, స్విమ్మింగ్, రన్నింగ్‌ తదితరాల్లో మెలకువలు నేర్చుకున్నారు. 

చౌరస్తాల అభివృద్ధిలో భాగంగా మూసాపేట కైత్లాపూర్‌ బ్రిడ్జి వద్ద ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తల ఉండే చోట పుస్తకం, పుస్తకం ఉండే చోట తలను పెట్టారు. చదువు ప్రాధాన్యాన్ని తెలుపుతూ.. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఇలా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.  

 ఏలూరు జిల్లా శాంతినగర్‌లో మూడు వారాల క్రితం ఓ భవనం గోడపై పుల్లలతో గూడు నిర్మించి అందులో రెండు గుడ్లు పెట్టింది ఈ పావురం. వాటిని పొదిగి పిల్లలను చేసి కంటికి రెప్పలా కాపాడుతుంది. ఆహారాన్ని తెచ్చి వాటికి తినిపించి అమ్మప్రేమను చాటి చెప్పింది.

బెంగళూరులో తయారైన విద్యుత్తు ఇంజిన్‌ ఇది. పంజాబ్‌లో దీని సేవలు వినియోగించుకునేందుకు తరలిస్తుండగా.. ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలం రోల్‌మామడ టోల్‌ప్లాజా వద్ద ఇలా ‘ఈనాడు’ కెమెరాకు చిక్కింది.

సముద్ర అలలకు విశాఖ తీరం తెన్నేటి పార్కు ప్రాంతానికి మూడున్నరేళ్ల కిందట కొట్టుకొచ్చేసిన ఎంవీ మా నౌక అప్పటి నుంచీ ఇదిగో ఇలా దిక్కులు చూస్తూ ఉంది. 

మంత్రాలయంలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మూల బృందావనంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. బంగారు, నవరత్న కవచాలతో అలంకరించారు. 

ఈ చిత్రంలో కనిపిస్తున్న వరి పంటలు రైతు భూముల్లో పండిస్తున్నవి అనుకుంటే పొరపాటే. కరీంనగర్‌ దిగువ మానేరు డ్యాం వెనుక భాగంలో కొందరు రైతులు వేసిన పంటలు ఇవి. డ్యాంలో నీరు తగ్గుముఖం పట్టడంతో.. వెనుక వైపు కొందరు రైతులు సుమారు 10 ఎకరాల్లో వరి పంటను సాగు చేయడంతో కోత దశకు వచ్చింది.   

హైదరాబాద్‌లోని బాలానగర్‌ ప్రధాన రహదారిలోని కోమటిబస్తీ వద్ద మంజీరా ప్రధాన పైప్‌లైన్‌ నుంచి తాగునీరు భారీగా లీకైంది. ఇక్కడ ఇటీవల కూకట్‌పల్లి సర్కిల్‌ అధికారులు వరద నీటి కాలువ నిర్మాణం చేస్తుండగా పైప్‌లైన్‌ జాయింట్‌ ఊడి ఒక్కసారిగా నీరు ఎగసిపడింది. 

హైదరాబాద్‌లోని కొత్తపేట రైతుబజార్‌ ఎదుట ఫుట్‌పాత్‌పై పెరిగిన బోగన్‌విల్లా మొక్క.. మొదలు నుంచి కొమ్మల వరకు పూలతో నిండిపోయిందిలా. ఆ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు ఆగి మరి చూస్తున్నారు.

అపార జలసంపదతో కళకళలాడే సోమశిల ముంపు ప్రాంతం ఎడారిని తలపిస్తోంది. జలసవ్వడి లేక కళావిహీనంగా మారింది. గతేడాది వరకు మండు వేసవిలోనూ మత్స్యసిరులతో సందడి చేసి ఆహ్లాదం పంచిన సుందర రమణీయ ప్రాంతం వెలవెలబోయింది. 

స్పెషల్‌ పాటల బాట పట్టిన తమన్నా..!

శ్రీలంక.. సిద్ధమా..!

అక్షయ్‌కుమార్‌ నాగిని డ్యాన్స్‌

Eenadu.net Home