చిత్రం చెప్పే విశేషాలు

(01-06-2024/1)

హనుమాన్‌ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా వినుకొండ పట్టణానికి చెందిన చిత్రకారుడు బొడ్డుచర్ల ప్రసాదరావు తమలపాకుల రూపంతో గీసిన హనుమాన్‌ చిత్రం ఆకట్టుకుంది. సంస్కృతంలో తమలపాకును నాగవల్లి అని పిలుస్తారు. కాబట్టి ఈ చిత్రానికి ‘నాగవల్లి హనుమాన్‌’ అని పేరు పెట్టారు. 

జాతీయ సర్ఫింగ్‌ పోటీలకు మంగళూరు సమీప శశిత్లూ తీరం వేదికగా మారింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు తొలిరోజు తమ సత్తా చాటే ప్రదర్శనలకు శ్రీకారం చుట్టారు. అందులో ఓ క్రీడాకారుడు చేసిన విన్యాసమిదీ. 

సినీ నటుడు విష్వక్‌సేన్‌ హీరోగా నటించిన ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ చిత్రం ఆర్టీసీ క్రాస్ర్‌రోడ్డులోని దేవి థియేటర్‌లో విడుదలైంది. అభిమానులతో కలిసి ఆయన సినిమాను వీక్షించారు. అనంతరం కారు ఎక్కిన ఆయన అభిమానులకు ఇలా అభివాదం చేస్తూ కనిపించారు.

కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, విద్యా సంస్థలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. హావేరిలో ఓ పాఠశాలలో విద్యార్థులు ఫొటోలు తీసుకునేందుకు ప్రత్యేకంగా బూత్‌లను ఏర్పాటు చేశారు. 

నల్గొండ జిల్లా మాచర్ల రోడ్డులోని సాగర్‌ మాత పుణ్యక్షేత్రాన్ని సందర్శకులు అధిక సంఖ్యలో దర్శించుకుంటున్నారు. సాగర్‌ బ్యాక్‌ వాటర్‌లో యువకులు బోట్లో షికారు చేస్తూ సరదాగా చేపల వేట సాగిస్తున్నారు. 

హనుమాన్‌ జయంతిని పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా సారవకోటలోని అభయాంజనేయ స్వామిని ఆలయ కమిటీ సభ్యులు కదలీ ఫలాలతో సుందరంగా అలంకరించారు. ఈ అలంకరణ చూపరులను ఆకట్టుకుంది.

భానుడి ప్రతాపానికి మూగజీవాలూ అల్లాడుతున్నాయి. ఉష్ణతాపం తీర్చుకోడానికి శునకం నరసాపురంలోని గోదావరి నదిని ఆశ్రయించగా.. ఏలూరు నగరపాలకసంస్థ ఆవరణలోని ఏసీ పైపు నుంచి జాలువారుతున్న నీటిబొట్లతో కాకి.. నీళ్ల ట్యాంకు పైపు నుంచి వస్తున్న నీటిని తాగేందుకు రామచిలుక ప్రయత్నిస్తోంది. 

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ముత్యాలమ్మగుడి వీధికి చెందిన కలంకారీ కళాకారుడు మునిబాబు వేసిన కలంకారీ చిత్రం ఆకట్టుకుంది. హనుమాన్‌ జయంతిని పురస్కరించుకుని కలంకారీ వస్త్రంపై ఐదు రోజుల వ్యవధిలో ఈ పెయింటింగ్‌ను అద్భుతంగా చిత్రీకరించారు.

రోహిణీ కార్తె ఎండలకు మనుషులతో పాటు పశుపక్షాదులు సైతం అల్లాడిపోతున్నాయి. ఎండ తీవ్రతను తట్టుకోలేక ఖమ్మం జిల్లా చింతకాని మండలం లచ్చగూడెం గ్రామంలో ఓ ఇంట్లో చల్లదనం కోసం గేదె దూడ కూలర్‌ వద్ద నిలబడింది. ఈ దృశ్యాన్ని ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మనిపించింది.

చిత్రం చెప్పే విశేషాలు (15-06-2024)

జీ7 సదస్సు.. విశేషాలివీ!

చిత్రం చెప్పే విశేషాలు (14-06-2024)

Eenadu.net Home