చిత్రం చెప్పే విశేషాలు
(02-06-2024)
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం.. పదేళ్లయిన సందర్భంగా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన పత్రచిత్రకారుడు గుండు శివకుమార్ రావి ఆకులపై తెలంగాణ తల్లి, చార్మినార్, ఇతర చిత్రాలతో పాటు అమరుల స్తూపం తదితర వాటిని మలిచారు. రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామ చెరువులో శనివారం మత్స్యకారులు వేట కొనసాగించగా.. ఒకరికి 25 కిలోల చేప (బొచ్చ రకం) చిక్కింది. దీంతో చేపను చూసేందుకు స్థానికులు తరలివచ్చారు. కొందరు మత్స్యకారులు చేపతో సెల్ఫీలు దిగారు.
హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ రోడ్డులో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తుండగా.. బండి పెట్రోల్ ట్యాంక్‌పై నిద్రపోతున్న ఓ బుడతడు ఇలా కనిపించాడు. కాస్త ఏమరుపాటుగా ఉన్నా ప్రమాదానికి ఆస్కారం ఇచ్చినట్టే అవుతుంది.
సుప్రసిద్ధ సినీ సంగీత దర్శకుడు ఇళయరాజా జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం నగరానికి చెందిన చిత్రకారుడు వాడాడ రాహుల్ పట్నాయక్ మూడు గంటలపాటు శ్రమించి నెమలి పింఛంపై గీసిన సూక్ష్మకళా చిత్రం అందరినీ ఆకట్టుకుంటోంది.
ఖమ్మం జల్లా నాగులవంచకు చెందిన ఓ వ్యక్తి ఎన్టీఆర్ జిల్లా వత్సవాయిలో ఈ బడ్డీని కొనుగోలు చేశారు. ఖమ్మం-బోనకల్లు ప్రధాన రహదారిలో పెద్ద పరిమాణంలో ఉన్న ఓ బడ్డీని టైర్ల ఎడ్ల బండిపై ఇలా తరలించారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం సందర్భంగా కూకట్‌పల్లి నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు విద్యుద్దీపాల వెలుగుల్లో దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి.
శ్రీకాకుళం జిల్లా లావేరు వస్త్రపురికాలనీకి చెందిన బాసిన నాగేశ్వరరావు, లక్ష్మి.. కూటమి విజయనగరం ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు సహకారంతో మోదీ ముఖ చిత్రంతో చేనేత వస్త్రం తయారుచేశారు.
వారం రోజుల క్రితం పెద్ద ఎత్తున వీచిన ఈదురు గాలులకు పలు చోట్ల మహా వృక్షాలు సైతం నేలకొరిగాయి. అయితే ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండలం రహదారిపై విరిగిపోయిన వృక్షం స్థానంలో రావి చెట్టు మొలిచిందిలా..