చిత్రం చెప్పే విశేషాలు

(06-06-2024)

నెల్లూరులో భగభగమనే ఎండతో మధ్యాహ్నం ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా మారి ఆకాశం ఇలా మేఘావృతమైంది. నాలుగు చినుకులు పడతాయనుకునేలోపే దోబూచులాడుతూ.. ఉట్టిగనే అలా తరలివెళ్లాయి.

హైదరాబాద్‌లో అక్కడక్కడా..మళ్లీ రూపాయి ఫోన్‌ బాక్సులు కనిపిస్తున్నాయి. చరవాణి ఛార్జింగ్‌ లేనప్పుడు అత్యవసరంగా ఎవరైనా ఇంటికి సమాచారం ఇచ్చుకోవడానికి వీటిని వినియోగిస్తున్నారు. ఈ చిత్రం నాంపల్లి-గాంధీభవన్‌ సమీపంలో కనిపించింది.

 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి రంగధాముని చెరువు, ఐడీఎల్‌ యాక్సిస్‌ రోడ్డు కూడలి వద్ద వృక్షాలను, పర్యావరణాన్ని రక్షించాలని స్ఫూర్తి కలిగించేలా ఏర్పాటు చేసిన ఈ కట్టడం ఆకట్టుకుంది. 

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్లాస్టిక్‌ సీసాల వినియోగం తగ్గించాలంటూ ఒడిశా రాష్ట్రం బ్రహ్మపురలోని ప్రభుత్వ ఐటీఐ ఆధ్వర్యంలో ‘టర్నింగ్‌ ఆఫ్‌ ది ట్యాప్‌’ పేరిట 12 అడుగుల ఎత్తున వ్యర్థాలు, పాత ప్లాస్టిక్‌ సీసాలతో కళాకృతిని ఆవిష్కరించారు.

ఎన్టీఆర్‌ జిల్లా గన్నవరానికి చెందిన షేక్‌ ఖాసిం... తెలుగుదేశం వీరాభిమాని. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి మెజారిటీ సాధించి.. చంద్రబాబు ఎన్డీయే సమావేశానికి దిల్లీకి వెళ్తున్నారని తెలిసి.. గన్నవరం విమానాశ్రయానికి ఇలా సైకిల్‌పై వచ్చారు.  

దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి పదవీ బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో కరీంనగర్‌ పట్టణంలోని మంకమ్మతోటకు చెందిన సైకత శిల్పి ఆర్‌.శంకర్‌ ఇసుకతో మోదీ సైకత శిల్పాన్ని రూపొందించారు. 

హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీలో పలువురు సినీ తారలు సందడి చేశారు. స్థానికంగా ఓ మాల్‌లో జరిగిన కార్యక్రమంలో హర్షవర్ధన్‌రాణే, వర్షిని, రియా సచ్‌దేవ ఉత్సాహంగా పాల్గొన్నారు.

నిజామాబాద్‌ జిల్లాలో ఏ సీజన్‌ అయినా ముందుగా బోధన్‌ డివిజన్‌లోనే వరినాట్లు, కోతలు ప్రారంభమవుతుంటాయి. నెల రోజుల కిందటే నారుమళ్లను సిద్ధం చేసుకున్న కర్షకులు ప్రస్తుతం నాట్లు వేడయం ప్రారంభించారు. 

విశాఖ జిల్లా చింతపల్లి మండలంలో వాటర్‌ యాపిల్‌ నోరూరిస్తోంది. వేసవిలో ఈ పండ్లకు మంచి డిమాండ్‌ ఉంటుంది. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉండటంతోపాటు ఆరోగ్యానికి మేలు చేసే విలువైన ఔషధ గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయని శాస్త్రవేత్త డాక్టర్‌ శివకుమార్‌ తెలిపారు. 

తిరుపతిలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. డ్రైనేజీలు సరిగా లేకపోవడంతో కాలువలో పడిన నీరంతా మురుగుతో కలిసి ఒక్కసారిగా రోడ్డుపైకి చేరింది. మోకాళ్లు మునిగే వరకు వచ్చిన మురుగుతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. 

చిత్రం చెప్పే విశేషాలు

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home