చిత్రం చెప్పే విశేషాలు

(07-06-2024)

శిశువును 21వ రోజున ఊయలలో వేస్తూ నామకరణ మహోత్సవం చేయడం అందరికీ సంబరమే. అదే ఒక ఆవు బిడ్డకు ఉత్సవం నిర్వహించడం భక్తితత్పరతతో కూడిన సంబరమే అవుతుంది. సిద్దిపేట పట్టణంలోని శ్రీరామరాజు రావిచెట్టు హనుమాన్‌ ఆలయ గోశాలలో ఓ లేగదూడకు కనులపండువగా నామకరణోత్సవం నిర్వహించారు.

వారాంతాలు కుటుంబంతో సరదాగా గడిపేందుకు ఇప్పుడు శాశ్వత నిర్మాణాల అవసరమే లేదు. రెడీమేడ్‌గా కొంతమంది వ్యాపారులు ఇళ్లను నిర్మించి అమ్ముతున్నారు. తోటలోకి తీసుకెళ్లి పెట్టుకోవచ్చు. ఈ చిత్రం హైదరాబాద్‌లోని పెద్దఅంబర్‌పేటలో కనిపించింది.

వర్షాలు విస్తృతంగా కురుస్తుండటంతో రైతులు పొలంబాట పట్టారు. రోహిణికార్తె బలంగా ఉందని నమ్మిన రైతులు పత్తి విత్తనాలు విత్తుతున్నారు. నల్గొండ జిల్లా గన్నెర్లపల్లి గ్రామ శివారులో రైతులు పత్తి విత్తనాలు విత్తుతున్న దృశ్యాన్ని ‘న్యూస్‌టుడే’ తన కెమెరాలో బంధించింది.

విశాఖ జిల్లా రాజవొమ్మంగిలో ఓ వ్యక్తి ఇంటి వద్ద సీతాకోకచిలుక వాలింది. పసుపు వర్ణంలో ఎంతో అందంగా ఉంది. రెక్కలపై నలుపు రంగు గీతలతో పాటు త్రిభుజాకారాలు కలిగి ఉంది. దాదాపు నాలుగు అంగుళాల పొడవు ఉండటంతో అందరూ ఆసక్తిగా చూశారు.

కొందరు గిరిజనులు అత్యంత అరుదుగా లభించే బూసీ పండ్లను ఖమ్మం జిల్లా మణుగూరులో విక్రయించారు. ఉడుము కాయలు, బంక కాయల మాదిరి కనిపించే ఈ పండ్లలో ‘సి’ మిటమిన్‌తోపాటు గింజలో అత్యధిక పోషకాలు ఉంటాయి.

హైదరాబాద్‌ గడ్డిఅన్నారం పరిధిలోని పటేల్‌నగర్‌లో ఈ చేతిపంపును తొలగించకుండానే సీసీ రోడ్డు వేశారు. రోడ్డు మధ్యలో నిరుపయోగంగా ఉన్న చేతిపంపుతో తీవ్ర ఇబ్బంది కలుగడమే కాకుండా రాత్రివేళ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఇటీవల ఆ దేశం వీసా స్లాట్లను విడుదల చేసింది. వీసా ఇంటర్వ్యూల కోసం విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, బంధువుల రాకతో హైదరాబాద్‌ నానక్‌రాంగూడలో ఉన్న కాన్సులేట్‌ కార్యాలయ ప్రాంగణం సందడిగా మారింది.   

 ఖమ్మం జిల్లా చంద్రుగొండ మండలం రావికంపాడు గ్రామంలో ఓ పంచాయతీ కార్మికునికి చింపాంజీ డ్రెస్‌ వేయించి, ఐదుగురు వ్యక్తులు గ్రామంలో కేకలు వేస్తూ, బాణసంచా కాల్చుతూ కోతులను తరుముతున్నారు. నాలుగైదు రోజులపాటు ఇలా చేస్తే కోతుల బెడద తొలగుతుందని గ్రామస్థులు తెలిపారు.

మహబూబ్‌నగర్‌ జిల్లా అలంపూర్‌ ప్రభుత్వ కళాశాల ఇది. వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు మార్గం లేక ఇలా తయారైంది. కళాశాల పరిసరాలు, క్రీడాస్థలం తదితరాలన్నీ నీటితో నిండిపోయాయి.

ఈ చిత్రం చూస్తుంటే చింతచెట్టుకు పనసకాయలు కాసినట్లుగా ఉంది కదూ.. విశాఖ జిల్లా రొంపల్లి పంచాయతీ కేంద్రానికి వెళ్లే మార్గమధ్యలో ఈ చెట్లు ఉన్నాయి. పనస, చింత చెట్లు రెండూ ఒకే చోట పెరిగాయి. అటుగా వెళ్లే ప్రయాణికులు దీన్ని ఆసక్తిగా తిలకిస్తున్నారు.

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home