చిత్రం చెప్పే విశేషాలు

(10-06-2024)

మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్రమోదీకి బహుమతిగా అందజేసేందుకు జమ్మూ-కశ్మీర్‌కు చెందిన నగల వ్యాపారి రింకూ చౌహాన్‌ మూడు కిలోల స్వచ్ఛమైన వెండి ఉపయోగించి భాజపా చిహ్నమైన కమలం పువ్వును తయారు చేశారు.

కురిసిన వర్షానికి తిరుమల మీదుగా ఆకాశంలో ఏర్పడిన ఇంద్రధనస్సు ఆకట్టుకుంది. మొదటి ఘాట్‌రోడ్డు మీదుగా కిందకు దిగే భక్తులు ఈ సుందర దృశ్యాన్ని తమ చరవాణుల్లో బంధించి సంతోషం వ్యక్తం చేశారు.

సాధారణంగా కంద దుంప పుష్పాలు పొడవుగా ఉంటాయి. పైన అలా ఉండి భూగర్భంలో దుంపలు ఏర్పడతాయి. విశాఖ జిల్లా రాజవొమ్మంగి మండలంలో కొన్ని మొక్కలు, పుష్పాల పైన లేత గులాబి రంగులో హృదయాకారం, వినాయక, శివలింగాకృతిలో ఉన్నాయి.

తిరుపల్లి జిల్లా శ్రీ పద్మావతి మహిళా వర్సిటీలోని గాంధీ పార్కులో ఏర్పాటు చేసిన అందాల కొలనులో అరవిరిసిన కమలాలు చూపరుల మనసుకెంతో హాయిని కలిగిస్తున్నాయి. వర్సిటీలో నాలుగు కొలనులు ఏర్పాటు చేసి అందులో కలువలను పెంచుతున్నారు.

మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన మోదీకి గంజాం జిల్లా హింజిలి సమీపంలోని కొంటెయికొళి గ్రామానికి చెందిన కళాకారుడు అరుణ్‌ కుమార్‌ సాహు కలపపై ఆయన ఆకృతిని తీర్చిదిద్ది శుభాకాంక్షలు తెలిపారు.

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం చేపల మార్కెట్‌లో ఆదివారం బొచ్చ జాతికి చెందిన 35 కేజీల బరువున్న చేప రూ.13 వేలు పలికింది. దీన్ని కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయంలో పట్టి విక్రయానికి తెచ్చినట్లు వ్యాపారి లక్ష్మణరావు తెలిపారు. 

దేశ ప్రధానిగా మూడో సారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ ఉన్నత పాఠశాల చిత్రలేఖన ఉపాధ్యాయుడు బ్రహ్మచారి.. రావి ఆకుపై చిత్రం వేసి శుభాకాంక్షలు తెలిపారు.

కర్నూలు జిల్లా ప్యాపిలి మండలంలోని గుడిపాడులోని ఎస్సీ కాలనీలో నీటి ఇబ్బందులు వర్ణించలేనివి. కాలనీలో 150 వరకు కుటుంబాలు నివసిస్తున్నాయి. కేవలం నీటి కోసమే పనులు మానుకుని నిరీక్షించాల్సి వస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

పిల్లలపై తండ్రికి ప్రేమ ఉండొచ్చు.. పిల్లలు గోము చేయొచ్చు... కానీ అది అతి కాకూడదు. స్కూటీపై ముందుభాగంలో ఒకరు, వెనుక భాగంలో ఇద్దరిని, భుజాలపై మరొకరిని కూర్చోపెట్టుకుని ప్రయాణించడం వైయస్సార్‌ జిల్లా మైదుకూరులోని ప్రొద్దుటూరురోడ్డులో కనిపించింది.

ఈనాడు గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావు మృతికి తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణం రాజా హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయుడు శేషగిరిరావు స్పందించారు. ఇటు కలం, అటు కుంచె విలపిస్తున్నాయంటూ ఆయన చిత్రం వేసి రామోజీకి నివాళులు అర్పించారు. . 

నల్గొండ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతుండటంతో రైతులు పొలం బాట పట్టారు. వ్యవసాయ పనులను వేగవంతం చేశారు. మర్రిగూడ మండలంలోని రాజపేట గ్రామంలో ఓ వ్యవసాయ కుటుంబం అరక దున్నుతూ విత్తనాలు నాటుతుండగా ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మనిపించింది.

స్పెషల్‌ పాటల బాట పట్టిన తమన్నా..!

శ్రీలంక.. సిద్ధమా..!

అక్షయ్‌కుమార్‌ నాగిని డ్యాన్స్‌

Eenadu.net Home