చిత్రం చెప్పే విశేషాలు
(11-06-2024)
తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతర అనంతరం వచ్చే మూడవ మంగళవారం అమ్మవారిని రకరకాల పండ్లతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.
వ్యాపారులు వినియోగదారులను ఆకట్టుకునేందుకు వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. మెదక్ జిల్లా సిద్దిపేటలో ఇద్దరు యువకులు కొత్త ఆలోచనలతో ఇటీవల ఓ రెస్టారంట్‌ను ప్రారంభించారు. ఇందులో నాలుగు రోబోలు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆరో స్నాతకోత్సవం హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని వర్సిటీ ఆడిటోరియంలో సందడిగా సాగింది. కార్యక్రమం అనంతరం విద్యార్థులు ఇలా ఫొటోలు దిగుతూ ఉత్సాహంగా గడిపారు.
టీ, కాఫీ, మంచినీళ్ల బాటిల్, బాదంపాలు, బిస్కెట్లను ఇచ్చే (డబ్ల్యూటీసీ) వెండింగ్ యంత్రాన్ని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ బస్టాండ్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. యంత్రంలోని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి డబ్బులు చెల్లిస్తే కావాల్సిన పదార్థం వస్తుంది.
హైదరాబాద్‌లోని లేక్ వ్యూ పార్క్‌లోని నీటిలో ఫ్లోటింగ్ గార్డెనింగ్‌ను ప్రయోగాత్మకంగా హెచ్‌ఎండీఏ ప్రారంభించింది. నీటి దుర్వాసనను అరికట్టడంతో పాటు ఆక్సిజన్ పెంచేలా మొక్కలను పెంచుతున్నారు.
మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించారు. పవన్‌ను శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనకు మిగిలిన ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.
అడ్డతీగల గ్రామదేవత సోమాలమ్మ తల్లికి విశాఖ జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యేగా ఎన్నికైన మిరియాల శిరీషాదేవి, విజయభాస్కర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర సందర్భంగా అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ చిత్రంలో కనిపిస్తున్నది చిన్నపాటి చెరువు అనుకుంటే పొరపాటే. ఇటీవల కురిసిన వర్షాలకు శ్రీ సత్యసాయి జిల్లా తాడిపత్రిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం జలమయం అయింది. పట్టణంలోని విద్యార్థులకు ఇదొక్కటే క్రీడా మైదానం చిన్నపాటి వర్షాలకే మడుగులా మారుతోంది.
మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ సమీపంలోని తుంగభద్ర నదికి ఎగువ నుంచి వరద నీరు వస్తోంది. జోగులాంబ ఆలయాల దర్శనానికి వచ్చే భక్తులు నది నీటిని తిలకిస్తూ ఆహ్లాదంగా గడుపుతున్నారు.