చిత్రం చెప్పే విశేషాలు
(12-06-2024)
ఏపీలో తెదేపా అధినేత చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారోత్సవం నేపథ్యంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన కళాకారుడు గొడ్డేటి బాలకృష్ణ అలియాస్ బాలు రక్తంతో ప్రధాని మోదీ, తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, జనసేనాని పవన్‌కల్యాణ్‌ల చిత్రాన్ని గీశారు.
కేంద్ర మంత్రులు అమిత్‌షా, జేపీ నడ్డాలతో శాసనసభాపక్ష నేత, తెదేపా అధినేత చంద్రబాబు.. ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాంశ్‌లతో కలిశారు.
ఏపీలో ఈనెల 13 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నందున బడులకు చిక్కీలు, కోడిగుడ్లు, రాగిపిండి సరఫరా చేస్తున్నారు. గతంలో చిక్కీలపై జగన్ ఫొటో కవర్లను ఏర్పాటుచేయగా, ఇప్పుడు వాటిని తొలగించి ప్రభుత్వ రాజముద్రతో కవర్లు రూపొందించారు.
తన కాళ్లపై తాను నిలబడే వరకు బిడ్డకు అన్నీ అమ్మే.. హైదరాబాద్ కోఠీలోని ప్రధాన రహదారిపై ఓ మాతృమూర్తి తన చిన్నారిని వీపున కట్టుకొని నడిచి వెళ్తుండగా.. మరొకరు ద్విచక్రవాహనంపై తీసుకెళ్తూ కనిపించారు.
విశాఖ జిల్లా మన్యంలో కురుస్తున్న వర్షాలతో పూల సోయగాలు ఆకర్షిస్తున్నాయి. డుంబ్రిగుడ మండల కేంద్రంలోని చాపరాయి జలవిహారికి ఆనుకుని అంత్రిగూడ రహదారిలో తెలుపు, లేత ఎరుపు రంగులో పచ్చని ఆకుల నడుమ ఉమ్మెత్త పూలు పర్యటకులను ఆకట్టుకుంటున్నాయి.
పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడికి చెందిన ప్రముఖ శిల్పకారుడు మందుగుల కనకలింగ వీరబ్రహ్మం 30 రోజుల పాటు కష్టపడి చెక్కపై ‘శ్రీమద్ రామాయణ వృత్తాంతం’ అందంగా తీర్చిదిద్దారు. ఈయన అనేక రకాల శిల్ప కళాఖండాలను గీస్తూ పట్టణంలో ఖ్యాతిగాంచారు.
సవాళ్లను అవకాశాలుగా మలుచుకుని.. అనుకున్న లక్ష్యాలను సాధించిన ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు అందరికీ స్ఫూర్తిప్రదాత అని కర్నూలు జిల్లా దేవనకొండకు చెందిన చిత్రకారుడు ఈరప్ప అన్నారు. రామోజీరావు చిత్రాన్ని రూపొందించి, తన అభిమానాన్ని చాటారు.
భానుడి ప్రతాపానికి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో వడగాలులను సైతం లెక్కచేయక రహదారి పక్కన గొడుగు నీడలో నిమ్మకాయలు విక్రయిస్తున్న ఈ అవ్వ పేరు నల్లమోతుల నారాయణమ్మ. అశ్వారావుపేట మండలం వినాయకపురానికి చెందిన ఈమె వయసు 85 ఏళ్లు.
వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో అన్నదాతలు విత్తనాలు విత్తేందుకు పనిముట్లను సిద్ధం చేసుకుంటున్నారు. నల్గొండ జిల్లా చందంపేట గ్రామానికి ఓ రైతు పోలేపల్లి గ్రామంలో సిద్ధం చేయించిన గుంట్కాను తన ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న దృశ్యం ‘న్యూస్‌టుడే’ కంట పడింది.
ఖమ్మం వేణుగోపాలనగర్‌కు చెందిన వెంపటి లక్ష్మయ్య భవన నిర్మాణ రంగ కార్మికుడు. తెదేపా సానుభూతిపరుడు. ఏపీ సీఎంగా నారా చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవానికి ఖమ్మం నుంచి సైకిల్‌పై అమరావతికి వెళ్తుండగా ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మనిపించింది.
వేసవి సెలవులు ముగిశాయి.. విద్యార్థులు ఆటలకు బైబై చెప్పి.. ఇక పాఠశాలలకు పరుగెత్తనున్నారు. దీంతో హైదరాబాద్ కోఠీలోని బుక్ స్టాళ్లు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కిక్కిరిసిపోయాయి.