చిత్రం చెప్పే విశేషాలు
(14-06-2024)
కురిసిన వర్షానికి యాదగిరి గుట్టలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ అష్టభుజి మండపం ప్రాకారాలు, రాజగోపురాలతో పాటు దైవారాధనల్లో పాల్గొనేందుకు వచ్చిన భక్తజనులు తడిసిపోయారు. వాన నీటిలో తడిసిన కృష్ణశిల రూపాలు భక్తజనులను ఆకట్టుకున్నాయి.
విశాఖ తీరంలోని సాగర్ నగర్ వద్ద ఇసుక తిన్నెలపై ఆకృతులు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. సాగరంపైనుంచి వచ్చే గాలులకు ఇసుక రేణువులు అందమైన రూపు సంతరించుకుంటున్నాయి. వీటిని చూసిన సందర్శకులు ఔరా అంటూ ఆశ్చర్యపోతున్నారు.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో జాతీయ రహదారి పక్కన గల చెరువులో నిండుగా నీళ్లు చేరాయి. కొన్నేళ్లుగా చెరువు ఎండిపోవడం లేదు. దీంతో చెరువులో ఏపుగా పెరిగిన తుమ్మ చెట్లు తడిసి ఇలా మోడై కనిపిస్తున్నాయి.
నవోదయ విద్యాలయాల విద్యార్థుల పారా స్పోర్ట్స్ శిక్షణ శిబిరానికి సినీ నటి రెజీనా హాజరై సందడి చేశారు. హైదరాబాద్ గోపన్‌పల్లిలోని విద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె ఇలా తుపాకీ గురిపెట్టి విద్యార్థుల్లో ఉత్సాహం నింపారు.
మెదక్ జిల్లా సిర్గాపూర్ మండలం కడ్పల్‌కు చెందిన గూడూరి ఆగమప్ప దివ్యాంగుడు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన మనవడిని ఎత్తుకున్న చిత్రాన్ని పెన్సిల్‌తో చక్కగా గీశాడు. హైదరాబాద్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆ చిత్రపటాన్ని ఆయనకు బహకరించారు.
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి, డోకులపాడు, మంచినీళ్లుపేట, నువ్వలరేవు, మెట్టూరు ప్రాంతాల్లో తీరం నుంచి సుమారు అర కి.మీ. పొడవునా కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. ఇసుక దిబ్బలు కోతకు గురవుతుండటంతో మత్స్యకారులు ఆందోళన చెందారు.
నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం చాముండేశ్వరీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంకురార్పణ, ధ్వజారోహణతో వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద పండితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సెలవుల్లో ఇంటిపట్టున ఉన్న యువతరం సొంతచేలలో కొందరు, బంధువుల చేలల్లో మరికొందరు పనుల్లో నిమగ్నమై కనిపించారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ శివారులో ఓ పంటచేనులో యువత పత్తి విత్తనాలు విత్తుతుండగా తీసిన చిత్రమిది.
వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో మిషన్ భగీరథ పైపునకు రంధ్రం పడింది. నీరు వృథాగా ప్రధాన వీధిలోని దారి గుండా పారుతోంది. పాదచారులకు ఇబ్బందిగా మారింది.
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం గాజులకొల్లివలస సంగమేశ్వరస్వామి కొండ వద్ద సైకత శిల్పి గేదెల హరికృష్ణ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తీర్చిదిద్దిన సైకత శిల్పం చూపరులను ఆకట్టుకుంటోంది.
బక్రీద్ పండగకు హైదరాబాద్ నగరంలో పొట్టేళ్ల అమ్మకం జోరందుకుంది. టోలిచౌకి నానాల్‌నగర్‌లో రూ.1.10లక్షలకు పొట్టేలు అమ్మకానికి వచ్చింది.