చిత్రం చెప్పే విశేషాలు

(15-06-2024)

సూర్యాపేట జిల్లా డి కొత్తపల్లిలోని సూర్యాపేట-జనగామ జాతీయ రహదారి పక్కన మిషన్‌ భగీరథ ప్రధాన పైపులైన్‌ లీకేజీతో ఫౌంటెయిన్‌ను తలపించేలా నీరు ఆకాశంవైపు ఎగజిమ్మడంతో వాహనదారులు, గ్రామస్థులు ప్రత్యేకంగా చూశారు. 

ఇటలీలో జీ7 సదస్సుకు అనుబంధంగా నిర్వహించిన కీలక సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. పోప్‌ ఫ్రాన్సిస్‌ను ఆప్యాయంగా పలకరించారు. చిత్రంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ.

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలోని మామిండ్లమడవ ప్రధాన రహదారికి ఇరువైపులా నాటిన గుల్‌మోహర్‌ మొక్కలు వృక్షాల్లా ఎదిగాయి. వేసవి ఎండలకు ఎండిన ఆ చెట్లు.. ఇటీవల కురిసిన వర్షాలకు చిగురించాయి. చెట్ల ఆకులు కనిపించనంతగా ఎర్రటి పూలు విరగబూశాయి.

తిరుపతిలో మహతి ఆడిటోరియంలో తిరుపడి సిరి సంత పేరుతో నిర్వహించిన సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల మేళా ఆకట్టుకుంది. పలు అంశాలపై యువతకు అవగాహన కల్పించారు. ప్రకృతి సిద్ధమైన ఉత్పత్తులతో పలువురు ప్రత్యేకత చాటగా.. యువత వాటిని తిలకించి సెల్ఫీలతో సందడి చేశారు. 

తెలంగాణ వరప్రదాయిని శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో రోజురోజుకు నీటిమట్టం తగ్గుతోంది. దీని నుంచి ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు సాగు, తాగు నీరందుతుంది. ప్రస్తుతం నీటి మట్టం తగ్గడంతో ఇసుక మేటలు కనిపిస్తున్నాయి

తిరుపతిలోని శ్రీగోవిందరాజ స్వామివారి పుష్పయాగం వైభవంగా జరిగింది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పుష్పయాగం అత్యంత వైభవంగా చేపట్టారు. మూడు టన్నుల పుష్పాలు వినియోగించారు. 

నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలోని గోగులపల్లి వద్ద ఆరు తలల తాటిచెట్టు ఉంది. ఇది గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలను అకట్టుకుంటోంది. ఈ దృశ్యాన్ని న్యూస్‌టుడే క్లిక్‌మనిపించింది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలు మండలంలోని కొణకంచికి చెందిన తెదేపా నాయకులు మలేసియాలో ప్రసిద్ధ కట్టడం పెట్రోనాస్‌ టవర్స్‌ వద్ద తెదేపా జెండా ఎగురవేసి సంబరాలు చేసుకున్నారు

ముస్లింల బక్రీద్‌ పండగ పురస్కరించుకొని పొట్ట్టేళ్లకు భలే గిరాకీ ఏర్పడింది. ధరలు ఒక్కసారిగా అధికమయ్యాయి. ఆదోని సంతలో పొట్టేళ్లకు రూ.1.10 లక్షలు పలికింది. వీటిని కర్నూలు జిల్లా ఆదోని పట్టణం మేతర్‌మసీదు ప్రాంతానికి చెందిన ఖాజా, ఖురేషి ఇబ్రహీం కొనుగోలు చేశారు.

తమిళనాడు రాష్ట్రం చెన్నై ఆళ్వార్‌పేట్టై సీబీ ఆర్ట్‌ సెంటర్‌లో పూంపుహార్‌ సంప్రదాయ కళాకృతుల ప్రదర్శన ఏర్పాటు చేశారు. పంచలోహ విగ్రహాలు, ఇత్తడి వస్తువులు, తంజావూర్‌ చిత్రలేఖనాలను సందర్శకులు ఆసక్తిగా తిలకించారు.

తమిళనాడు రాష్ట్రం చేట్‌పేట్‌లోని మద్రాసు క్రిస్టియన్‌ కాలేజ్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్‌లో విద్యార్థులు ప్లాస్టిక్‌ నియంత్రిద్దామని, వస్త్ర సంచులు ఉపయోగిద్దామని అవగాహన ప్రదర్శన నిర్వహించారు.

అలవాటుగా మారిందేదీ కష్టంగా అనిపించదు

చిత్రం చెప్పే వార్తలు (21-10-2024)

మీ జీవితపు స్టీరింగును వేరొకరికి ఇవ్వొద్దు

Eenadu.net Home