చిత్రం చెప్పే విశేషాలు

(19-06-2024)

నిజామాబాద్‌ జిల్లా కేంద్రం గంగాస్థాన్‌-2లో ఇళ్ల మధ్య ఉన్న ఓ చెట్టు ఆకులన్నీ రాలిపోయి మోడువారింది. ఆ ఎండిన చెట్టుపైనే పిచ్చుకలు ఇలా గూళ్లు కట్టుకున్నాయి. ఆ ప్రదేశం ఉదయం, సాయంత్రం పక్షుల కిలకిలారావాలతో సందడిగా ప్రేమికులను ఆహ్లాదపరుస్తోంది.

ప్రకృతి సోయగంతో..ఖమ్మం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు జలాశయం చూపరులను ఆకట్టుకొంటోంది. జలాశయం వద్ద సాయంత్రం వేళ ఆవిష్కృతమైన ఈ చూడముచ్చటైన దృశ్యం ఎంతగానో కనువిందు చేసింది.

ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండి మండలంలో ఇటీవల కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కుంటాల జలపాతం వద్ద నీరు జాలువారుతోంది. అయితే ఆ నీటితోపాటు చిన్నా పెద్దా చేపలు సైతం కొట్టుకుని వస్తున్నాయి. 

కర్నూలు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం సంగమేశ్వరం సమీపంలో కృష్ణా నదిలో ఇప్పుడిప్పుడే వరదనీరు చేరుతోంది. సమీప ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు నది చెంతనే వలలు సరిచేసుకుంటూ కనిపించారు.

ప్రతికూల వాతావరణం టమాటా ధరను సామాన్యుడికి అందనంత ఎత్తుకు తీసుకెళ్లింది. పది రోజుల కిందట కిలో రూ.40 ఉన్న ధర ఒక్కసారిగా ఎగబాకింది. నిన్నమొన్నటి వరకు రూ.80 ఉండగా నిజామాబాద్‌లో రూ.వందకు చేరింది. 

కారులో జిరాక్స్‌ యంత్రం నిర్వహిస్తున్న ఇతని పేరు కోలా నర్సింహారావు. చదివింది బీకాం. తల్లి నాగమణితో కలిసి ఖమ్మం నగరంలోని సుందరయ్యనగర్‌లో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. బ్యాటరీల సాయంతో జిరాక్స్‌ యంత్రం, ప్రింటర్, ల్యాప్‌టాప్‌ పనిచేసేలా చూసుకుంటున్నారు. 

ఇటీవల కురిసిన వర్షాలకు వైయస్సార్‌ జిల్లా జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామం చుట్టూ నీరు చేరింది. వరద నీటి మధ్యలో గ్రామం ఇలా కనిపిస్తోంది. 

నంద్యాల జిల్లా సప్తనదుల సంగమేశ్వరం వద్ద కృష్ణా నదిలో సంగమేశ్వరం ఆలయం సమీపంలో కిలోమీటర్ల మేర గుర్రపుడెక్క విస్తరించింది. నదిలో ఎటుచూసినా గుర్రపుడెక్క పెరిగిపోయింది. దీంతో బోట్లు ముందుకు సాగడం లేదు.

నిర్మల్‌ జిల్లా కడెం మండలం ఉడుంపూర్‌ రేంజ్‌ పరిధిలోని పెద్దవాగు పరిసరాల్లో అటవీ అధికారులు అరుదైన జాతి రకం కప్పను గుర్తించారు. కవ్వాల్‌ పెద్దపులుల సంరక్షణ కేంద్రం పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలో ఈ కప్ప కనిపించడంతో ఫొటోలు తీశారు.

కాకినాడ సముద్రతీరంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలలకు మంగళవారం భారీ చేపలు చిక్కాయి. అందులో కొమ్ముకోణెం, నెమలికోణెం తదితర రకాలు ఉన్నాయి. సుమారు 300 కేజీల బరువున్న కొమ్ముకోణెం చేపను ఒడ్డుకు చేర్చేందుకు మత్స్యకారులు శ్రమించాల్సి వచ్చింది. 

హైదరాబాద్‌లోని ఉప్పల్‌ నల్లచెరువు.. పూర్తిగా గుర్రపు డెక్కతో నిండిపోయింది. మరోవైపు చుట్టుపక్కల పరిశ్రమల నుంచి రసాయన, కలుషిత నీరు చేరి విపరీతంగా దుర్గంధం వెలువడుతోంది. పరిసర ప్రాంతాల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home