చిత్రం చెప్పే విశేషాలు

(23-06-2024)

నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో ఇటీవల ప్రారంభించిన ఛత్రపతి శివాజీ విగ్రహం ఆకట్టుకుంటోంది. మహారాష్ట్ర తుల్జాపూర్‌లో ఉన్న విగ్రహం మాదిరిగా దీనిని తయారు చేయించారు. ఇలాంటి విగ్రహ నమూనా జిల్లాలో ఎక్కడా లేదని గ్రామస్థులు తెలిపారు.

హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌ తీరంలో ఆకాశం నీలి మబ్బులతో నిండిపోయింది. ఆ మసక చీకటిలో ఓ మహిళ చేతిలోని మిరుమిట్లు గొలిపే బుడగలు కనువిందు చేశాయి.

ఎర్రని పట్టు వస్త్రాన్ని కప్పుకొన్నట్లుగా కనిపించే పురుగులు కేవలం ఆరుద్ర కార్తెలోనే కనిపిస్తాయి. ఆదిలాబాద్‌ జిల్లా పెంచికల్‌పేట్‌ మండలంలోని బొంబాయిగూడ గ్రామ శివారులోని పంట పొలాల్లో ఇలా గుంపుగా కనిపించి కనువిందు చేశాయి.

హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆసుపత్రి, పరిశోధన సంస్థ 24వ వ్యవస్థాపక దినోత్సవంలో ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వేంకటేశ్వర స్వామి ప్రతిమను బసవతారకం ఆసుపత్రి ఛైర్మన్‌ నందమూరి బాలకృష్ణ బహూకరించారు.

నెల్లూరులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెంచలకోనలో లక్ష్మీనరసింహస్వామి, అమ్మవార్ల కల్యాణం కమనీయంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని.. తిలకించారు. రాత్రి తిరుచ్చి ఉత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ కనుల పండువగా సాగింది.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని గుడేకల్‌లో ఏరువాక పౌర్ణమిని యువకులు వినూత్నంగా నిర్వహించారు. వృషభాల ఊరేగింపుతోపాటు సినీ నటులు అల్లు అర్జున్, ప్రభాస్, జూనియర్‌ ఎన్టీఆర్‌ చిత్రపటాలను ఊరేగించారు.

ఎస్వీ జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాలోని స్థానిక భువన విజయం ఆడిటోరియంలో కళాంజలి ఫ్యాషన్‌ షో జరిగింది. వైద్య విద్యార్థులు కళాంజలి వస్త్రాలు ధరించి ర్యాంప్‌ వాక్‌తో ఆకట్టుకున్నారు.

ఖమ్మం జిల్లా చింతకాని మండలం వందనం రహదారి వెంట వందలాది చెట్లు నిండుగా పుష్పాలతో ఆహ్లాదకరంగా దర్శనమిస్తున్నాయి. కొందరు వాహనచోదకులు చెట్ల నీడన కాసేపు సేద తీరుతూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు.

మెదక్‌ జిల్లా టేక్మాల్‌ మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో శనివారం ఏరువాక పౌర్ణమిని ఘనంగా నిర్వహించారు. గొల్లగుడెంలో జాతర జరిగింది. స్థానికంగా ఉన్న దుర్గమ్మ, పోచమ్మ, టేక్మాల్‌ చౌరస్తాలోని మత్తడి పోచమ్మ దేవాలయాల చుట్టూ బండ్లను, ట్రాక్టర్లను ఊరేగించారు.

హైదరాబాద్‌లోని జలమండలి డివిజన్‌-3 పరిధిలో లక్ష్మీ నగర్‌ నుంచి గుడిమల్కాపూర్‌ వెళ్లే దారిలో తాగునీటి పైప్‌ లైన్‌ లీకైంది. పరిసరాల్లోని నివాసితులు వచ్చి ఆ నీటిని బిందెల్లోకి వడకట్టుకుని పట్టుకున్నారిలా..

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home