చిత్రం చెప్పే విశేషాలు
(24-06-2024)
సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ల నిరవధిక సమ్మె చేపట్టారు. అత్యవసర సేవలు మినహా ఓపీ, వార్డు విభాగాల వైద్య సేవలు నిలిపివేసినట్లు జూనియర్ డాక్టర్లు తెలిపారు. అనంతరం ఆసుపత్రి బయట ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు.
విజయవాడ ఎస్‌బీఐ కాలనీ-1లోని ఓ ఇంటి ఆవరణలో ఉన్న పనస చెట్టు కాండం పొడవునా.. గుత్తులుగా 55కి పైగా కాయలు కాసి చూపరులను ఆకట్టుకుంటోంది. యాదృచ్ఛికంగా పనస పండు తిని విత్తనం పారేయగా చెట్టుగా ఎదిగి ఇలా పండ్లను ఇస్తోందని చెప్పారు.
జనసేన పార్టీ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ అయిన ఓ ఫొటో నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫ్యామిలీ పిక్ అది. తన శ్రీమతి అనా, పిల్లలు అకీరా నందన్, ఆద్యలతో కలిసి దిగిన ఆ అరుదైన స్టిల్ వైరల్ అవుతోంది.
అమెరికాలోని ఐయోవా రాష్ట్రంలో దాదాపు వారం రోజుల నుంచి భారీ వర్షాలు పడుతుండటంతో చాలా కౌంటీలు జలమయం అయ్యాయి. దాదాపు 4,200 మంది జీవించే రాక్‌వ్యాలీ ప్రాంతంలోని వందలాది ఇళ్లు పూర్తిగా నీట మునిగిపోయాయి.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆదివారం ప్రముఖ నటుడు చిరంజీవితో భేటీ అయ్యారు. హైదరాబాద్.. జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి మర్యాదపూర్వకంగా విచ్చేసిన సంజయ్‌ను చిరంజీవి శాలువా కప్పి సన్మానించారు.
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం గోప్లాపూర్ గ్రామంలో ఓ రైతు అర ఎకరా విస్తీర్ణంలో రెండు రకాల చిక్కుళ్లను కలిపి సాగుచేశారు. ప్రస్తుతం తోట పూత దశలో ఉంది. తెలుపు, ఊదా రంగు పూతతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దూరం నుంచి చూసేవారికి పూల తోటను తలపిస్తోంది.
కుమురంభీం జిల్లా లింగాపూర్ మండల కేంద్రం పరిధిలోని సప్తగుండాల జలపాతం (మిట్టె) జలకళ సంతరించుకుంది. మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న వానలకు వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. పచ్చటి ప్రకృతి అందాల మధ్య సహజసిద్ధంగా జాలువారుతూ పర్యాటకులను ఆకర్షిస్తోంది.
కళకు ప్రాంతం, భాష బేధాలుండవు. రాజస్థాన్ కళాకారులు... నిమ్మ, జామ, మామిడి లాంటి చెట్ల కర్రలకు ఆకృతినిచ్చి అందమైన రూపాన్నిచ్చారు. హైదరాబాద్‌లో వాటిని విక్రయానికి ఉంచగా.. చూపరులను ఆకట్టుకుంటున్నాయి.
తాటి చెట్టు సాధారణంగా నిటారుగా ఎలాంటి కొమ్మలు లేకుండా ఉంటుంది. కానీ అనంతగిరి రోడ్డులో రహదారి వెంట నల్గొండ జిల్లా కోదాడ పట్టణ శివారులో ఉన్న ఈ తాటి చెట్టుకు ఒకటి రెండు కాదు ఏకంగా ఐదు కొమ్మలు వచ్చాయి.
మెదక్ జిల్లా చిన్నకోడూరు మండలం అల్లీపూర్ రోడ్డులో మొక్కజొన్న విత్తనాలను పొలంలో నాటడానికి రైతులు యంత్రాలను వాడుతున్నారు. సులభంగా విత్తుకోగలుగుతున్నామని, త్వరగా పని పూర్తవుతోందని రైతులు చెప్పారు.