చిత్రం చెప్పే విశేషాలు

(27-06-2024)

మహబూబ్‌నగర్‌ జిల్లా పెద్దమందడి మండలం వీరాయపల్లి గ్రామ సమీపంలో రైతు దాసరి రాములు మొక్కజొన్న సాగు చేస్తున్నారు. కలుపు తొలగించేందుకు ట్రాక్టర్‌ అద్దె రూ.3వేలు అవుతుందని యజమాని చెప్పడంతో ఓ వ్యక్తి వద్ద ఉన్న సైకిల్‌ను తీసుకుని వెనక టైరును తొలగించి ఇలా గుంటక ఏర్పాటు చేసుకున్నారు.

హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కుటుంబసభ్యులతో కలిసి పార్లమెంటు భవనంలో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. మూడోసారి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తన ముందు పాటపాడి అలరించిన దత్తాత్రేయ మనుమరాళ్లను ప్రధాని మోదీ అభినందించారు.

హైదరాబాద్‌ : ముషీరాబాద్‌లోని వీఎస్‌టీ పార్కును జీహెచ్‌ఎంసీ రూ.40 లక్షలతో అందంగా రూపుదిద్దుతోంది. ఈత కొట్టేందుకు చిన్నారులు బావుల్లో దూకుతున్నట్లుగా తీర్చిదిద్దుతున్న బొమ్మలు ఆకట్టుకుంటున్నాయి.

వేట దృశ్యాలు ఈ సీజన్‌లో ఎన్నెన్నో! ఖమ్మం జిల్లా ప్రకాశ్‌ నగర్‌లోని చప్టా వంతెన వద్ద కొందరు యువకులు, చిన్నారులు మత్స్యవేట సాగిస్తుండగా న్యూస్‌ టుడే క్లిక్‌ మనిపించింది.

కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ చేపలరేవులో వేటకెళ్లిన ఓ మత్స్యకారుడి వలకు భారీ నల్లమట్ట చేప లభ్యమైంది. ఈ జాతికి చెందిన చేపలు చాలా అరుదుగా లభిస్తాయి. ఐదు అడుగుల పొడవుతో పాటు, సుమారు 80 కిలోల బరువు ఉంది. 

విశాఖ జిల్లాలోని అయిదు రోడ్ల కూడలిలోని శ్రీ బాల వినాయకస్వామి ఆలయం ముంగిట వారాహి అమ్మవారి ఆకృతిలో సహస్ర దీపాలంకరణ అందరినీ అలరించింది. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకొని భక్తులు ఈ దీపారాధన నిర్వహించారు. 

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌గా నియమితులైన సృజన బాధ్యతలు స్వీకరించడానికి కుమారుడితో కలిసి కలెక్టరేట్‌కు వచ్చారు. బాధ్యతల స్వీకరించిన తర్వాత కుమారుడిని ఇంటికెళ్లమని చెప్పారు. వెళ్లనని మారాం చేస్తున్న కుమారుడిని దగ్గరకు తీసుకుని సముదాయించి సహాయకుల వద్దకు పంపారు. 

వర్షాలు కురవక మొలకెత్తిన పత్తి మొక్కలు వాడిపోతున్నాయని ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షం లేక సాగు భూములు నెర్రలువారుతున్నాయని, ఒక్కసారైనా వచ్చిపో అంటూ రైతులు వరుణ దేవుడిని వేడుకుంటున్నారు.  

విశాఖ జిల్లా మన్యంలో భిన్నమైన వాతావరణం చూపరులకు హాయి గొలుపుతోంది. చింతపల్లి మండలంలోని లంబసింగి కొండల్లో పొగమంచు సోయగాలు ప్రకృతిప్రియుల మనసును హత్తుకుంటున్నాయి. పచ్చనికొండల నడుమ పొగమంచు అందాలు అబ్బురపరుస్తూ ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.

వసతిగృహంలో ఇద్దరు కుమారులను చేర్పించడానికి తండ్రి ఇలా ద్విచక్ర వాహనంపై ప్రమాదకరంగా తీసుకెళ్తున్నారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఈ ప్రమాదకర ప్రయాణం కనిపించింది.  

అందంలో ఇదే తారస్థాయి

చిత్రం చెప్పే విశేషాలు (18-07-2024)

చిత్రం చెప్పే విశేషాలు (17-07-2024)

Eenadu.net Home