చిత్రం చెప్పే విశేషాలు

(29-06-2024)

గత విద్యా సంవత్సరంలో 10, 12 తరగతుల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, ప్రముఖ నటుడు విజయ్‌ బహుమతులు, ప్రశంసాపత్రాలు అందించారు. చెన్నై తిరువాన్మియూర్‌లో జరిగిన కార్యక్రమంలో 21 జిల్లాలకు చెందిన 800 మంది విద్యార్థులకు పంపిణీ చేశారు.

ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ 109వ చిత్రం చిత్రీకరణ కర్నూలులోని ఓర్వకల్లు రాక్‌ గార్డెన్స్‌ ప్రాంతంలో జరుగుతోంది. ఆదోని పట్టణానికి చెందిన నందమూరి యువసేన సేవా సంస్థ అధ్యక్షుడు సజ్జాద్‌ తన భార్య, కొడుకుతో బాలకృష్ణను కలిశారు. బాలయ్య వారితో కలిసి భోజనం చేశారు. 

కర్నూలు మండలం తులశాపురానికి చెందిన లక్ష్మన్న కుమారులు కాడెద్దులుగా మారి పొలం దుక్కిదున్నే పనులు చేస్తున్నారు. దుక్కి దున్నేందుకు కూలీ రూ.వెయ్యి చెల్లించలేక కొడుకులు ముందువైపు లాగుతుండగా.. ఆముదాల పంటలో దుక్కి దున్నుతున్నట్లు తెలిపారు. 

కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పాగోలులోని ఎన్టీఆర్‌ మోడల్‌ స్కూల్‌ను ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ, ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సందర్శించారు. అనంతరం పిల్లలతో కలిసి భోజనం చేసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. 

టీ 20 క్రికెట్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌లో భారత్‌ దక్షిణాఫ్రికాతో తలపడనుంది. పోటీల్లో భారత్‌ విజయం సాధించాలని కోరుతూ విశాఖ జిల్లా నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లుకు చెందిన సూక్ష్మ కళాకారుడు, కార్పెంటర్‌ దార్ల రవి చెక్కతో 3 గంటల్లో పొట్టికప్పు నమూనాను తయారు చేశాడు.

విశాఖ జిల్లాలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో దశాబ్దాల నాటి మామిడి చెట్టు విరగకాసింది. గుత్తులు గుత్తులుగా కాసి చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ చెట్టు ఏడాదికి సుమారుగా 3000 కాయల వరకు కాస్తుందని స్థానికులు తెలిపారు

వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి శివసాగర తీరం అల్లకల్లోలంగా మారింది. గత రెండు రోజులుగా సముద్రం ఉద్ధృతంగా మారడంతో కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచి మరింతగా తీవ్రమయ్యాయి. సమీప తోటల వరకు అలలు చొచ్చుకొస్తున్నాయి.

హైదరాబాద్‌ నగరంలోని పలుచోట్ల వర్షం కురిసింది. ఫైఓవర్లు పైనుంచి రోడ్డు మీదకు వాన నీరు జలపాతంలా కిందకు పారింది. జూబ్లీహిల్స్‌ రోడ్డు నం.45లోని ఆకాశవంతెన వద్ద కనిపించిందీ చిత్రమిది.

అడుగు ఎత్తులో.. చాట వెడల్పున ఎదిగిన ఓ పుట్టగొడుగు ఎంతగానో ఆకట్టుకుంటోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం వీరునాయక్‌తండా సమీపంలోని అడవిలో పెరిగిన ఈ పుట్టగొడుగు శ్వేత వర్ణంలో మెరిసిపోతోంది. స్థానికులు దీన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

హైదరాబాద్‌.. కీసరగుట్టలోని కొలనులో తామర(కమలం) పువ్వులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఓవైపు తెల్ల తామర పూలు,  మరోవైపు చెరువు కట్టపై ఎర్ర పూలు ఆహ్లాదం పంచుతున్నాయి. 

నిజామాబాద్‌ జిల్లా కేంద్రం నుంచి ఆర్మూర్‌ వెళ్లే ప్రధాన రహదారి పక్కన బోర్గాం(కె) మూలమలపు వద్ద ఉన్న రెండు పాడైన సిమెంట్‌ పైపుల్లో ఒకదాన్ని తన ఇల్లుగా మార్చుకొని జీవిస్తుంది ఈ వృద్ధురాలు.  భర్త చనిపోయారని, నా అనేవారు కానీ, ఉండటానికి ఇల్లు సైతం లేదని ఆమె పేర్కొన్నారు.

అలవాటుగా మారిందేదీ కష్టంగా అనిపించదు

చిత్రం చెప్పే వార్తలు (21-10-2024)

మీ జీవితపు స్టీరింగును వేరొకరికి ఇవ్వొద్దు

Eenadu.net Home