చిత్రం చెప్పే విశేషాలు
(30-06-2024)
హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లో రేగట్టా క్రీడాకారులు సాధన చేస్తూ కనిపించారు. ఒకే వరుసలో తెల్లని తెరచాపలతో జాతీయ జెండా నీడలో ఇలా నగరవాసులను కనువిందు చేశారు.
శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలం పేరూరు జలాశయం వద్ద రెండు చిలుకలు గూటి కోసం కొట్లాడుకున్నాయి. తన గూటి వద్ద వాలిందని ఒక రామచిలుకపై మరొక చిలుక పోరుకు దిగింది. కొన్ని నిమిషాలపాటు ఆ రెండు గాలిలో చిన్నపాటి యుద్ధం చేసుకున్న దృశ్యాలు కెమరాకు చిక్కాయి.
విశాఖ జిల్లా చింతపల్లి మండలం బైలుకించంగిలో బ్రహ్మకమలాలు విరబూశాయి. హిందీ ఉపాధ్యాయుడు గసాడ పద్మనాభం ఇంటి పెరట్లో రాత్రివేళల్లో ఇవి వికసించి అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కేవలం రాత్రివేళల్లో మాత్రమే వికసించడం వీటి ప్రత్యేకత.
పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలంలోని దశుమంతపురం గ్రామానికి చెందిన ఎ.వైకుంఠరావు పాలకొండ ఎమ్మెల్యే జయకృష్ణ, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడి చిత్రాలను రావి ఆకులపై రూపొందించారు.
వర్షాధార పంటల్లో పత్తి ఒకటి. మొదటి వర్షానికి విత్తనాలు వేస్తే.. ఆ తర్వాత వర్షాలు మొహం చాటేశాయి.. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం ఆసిరెడ్డిపల్లికి చెందిన యువ రైతు నాగేశ్ తుంపర పద్ధతిలో పత్తి పంటకు నీటిని అందిస్తున్నాడు.
చిత్తూరు జిల్లాలోని కోటలో కోటమ్మ అమ్మవారి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సముద్రస్నానానికి వెళ్లిన వందలాది మంది భక్తులు పూలబుట్టలతో ఆలయ ధర్మకర్త ఇంటి నుంచి ఆలయం వరకు ఊరేగింపుగా వచ్చారు.
దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించిన వెంటనే హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున యువత ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. ‘భారత మాతకు జై’ అంటూ నినాదాలు చేశారు. కేరింతలు కొడుతూ జాతీయ జెండాను చేతపట్టుకొని ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ సంబరాలు చేసుకున్నారు.
టీ20 ప్రపంచ కప్ విశ్వవిజేతగా నిలిచిన టీమ్‌ఇండియా జట్టు ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. ఆ సమయంలో టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ వీడియో కాల్ ద్వారా తన సతీమణి అనుష్క శర్మ, కుమార్తెకు వీడియో కాల్ చేసి సంతోషాన్నిపంచుకున్నాడు. ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
తొలకరి వర్షాలకు జగిత్యాల జిల్లాలోని అటవీ తీర ప్రాంతాలు ప్రకృతి సోయగంతో పచ్చని తోరణంలా మారాయి. రాయికల్ మండలంలోని కట్కాపూర్ గ్రామంలోని వెన్నెముద్దల గండి నీటి ప్రవాహంతో కళకళలాడుతోంది. రహదారి పొడవునా పచ్చని చెట్లతో సందర్శకులను ఆకట్టుకుంటోంది.
ఇదేం చెరువు కాదు.. కరీంనగర్ ఒకటో డివిజన్ పరిధిలోని రైల్వేస్టేషన్ గేట్ సమీపంలో ఉన్న చంద్రపురి కాలనీ ఖాళీ స్థలంలో నిలిచిన వర్షం నీరు ఇది. ఓ వీధిలోకి రాకపోకలు సాగించాలంటే ఇందుల్లోంచే వెళ్లాల్సి రావడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.