చిత్రం చెప్పే విశేషాలు
(03-07-2024)
నల్గొండ జిల్లాలోని యాదాద్రీశుడి సన్నిధిలో వర్షం కురిసింది. దీంతో కృష్ణశిలతో నిర్మించిన ఆలయ గోపురం తడిసి ఆకర్షణీయంగా మారి భక్తులను ఆకట్టుకుంది.
ఉట్నూరు మండలం వడ్‌గల్‌పూర్‌కు చెందిన రైతు సిందే సురేష్ తన ఆలోచనతో పాడైన సైకిల్‌ను కొని దానికి వ్యవసాయ పరికరాలు అమర్చి పత్తి చేనులో కలుపు, గుంటుక తీయడానికి ఉపయోగిస్తున్నారు. ఇందుకు రూ.1,000 ఖర్చు చేసినట్లు తెలిపారు.
హైదరాబాద్‌లోని నాంపల్లి కూడలి వద్ద ట్రాఫిక్ ఐలాండ్‌లో పోలీసులు ఉంటారని తెలిసినా.. ద్విచక్రవాహనంపై నలుగురు విద్యార్థులతో శిరస్త్రాణం సైతం లేకుండా ఓ వ్యక్తి ప్రమాదకరంగా ప్రయాణించారు.
విశాఖ జిల్లా రాజవొమ్మంగిలో కె.సత్యవతికి బంధువులు ఇచ్చిన బొప్పాయిని రెండు భాగాలుగా కోయగా అందులో ఒక్కొక్క దానిలో విత్తనాలు (నల్లటి గింజలు) లేకుండా కనిపించాయి. తెల్లటి రంగులో మూత్రపిండాల ఆకారంలో రెండు గింజలు పెద్ద సైజులో, ఇంకో దానిలో చిన్న సైజులో కనిపించాయి.
కర్ణాటకలోని బబలేశ్వర తాలూకా బబలాది గ్రామానికి చెందిన సిద్ధనగౌడ పాటిల్ అలియాస్ రామనగౌడ అనే రైతు తన ఎద్దును రూ.18.01 లక్షలకు విక్రయించారు. ఇది ఒక విలాసవంతమైన కారు ధర కన్నా ఎక్కువ. మూడేళ్ల కిందట తమ జిల్లాలో కోర్తి కొల్హార నుంచి రూ.1.05 లక్షలకు ఈ ఎద్దును ఆయన కొనుగోలు చేశారు.
రెండు నెలల పాటు క్రమశిక్షణతో, భక్తితో సంప్రదాయ కోలాటం నేర్చుకున్న మహిళలు నల్గొండ పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనీలో ప్రదర్శన చేశారు. జడ కొప్పు, చెక్కభజన వీక్షకులను ఆకట్టుకుంది.
విశాఖ జిల్లా దసపల్లా హిల్స్ ప్రాంతంలోని ఈ భవనం పచ్చదనంతో కనువిందు చేస్తోంది. ప్రతి అంతస్తులో రకరకాల మొక్కలు పెంచడంతో అటుగా వెళ్లే ప్రతి ఒక్కరూ కన్నార్పకుండా చూస్తున్నారు.
ఏకాదశిని పురస్కరించుకొని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మెదక్ జిల్లాలోని ఏడుపాయల్లో కొలువుదీరిన వనదుర్గమ్మకు సహస్ర పుష్పార్చన నిర్వహించారు. తెల్లవారుజామున 5 గంటలకు అర్చకుడు అమ్మవారికి అభిషేకం చేసి మల్లె, జాజి, లిల్లీ పూలతో ప్రత్యేకంగా అలంకరించారు.