చిత్రం చెప్పే విశేషాలు

(06-07-2024)

విశాఖ జిల్లా మోతుగూడెం మన్యంలో మది దోచేలా మంచు సోయగాలు కనువిందు చేస్తున్నాయి. ఈ ప్రాంతంలో రోజూ వర్షం పడుతోంది. వర్షం తగ్గాక కొండలపై మంచు పరుచుకుని అద్భుత దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నాయి. సుకుమామిడి సమీపంలోని కొండలపై మంచును ఈ చిత్రాల్లో చూడవచ్చు

రష్యాతో సాగుతున్న యుద్ధం తమ జీవితాలను అతలాకుతలం చేసినా ప్రకృతితో మమేకమై... జీవితంలో గుచ్చుకున్న ముళ్లను గులాబీల్లా భరిస్తున్నారు! ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో అడుగడుగునా కనిపించే ఈ దృశ్యాలే... యుద్ధంలోనూ ప్రకృతి పట్ల... పువ్వుల పట్ల వారికున్న శ్రద్ధకు నిదర్శనాలు!

అన్నమయ్య జిల్లా కలికిరిలోని ఎహసానుల్లా మిషన్‌ కాంపౌండ్‌ సమీపంలోని బాలిరెడ్డి సోమశేఖరరెడ్డి ఇంటి పెరట్లో పెంచిన అంజూర చెట్టు కాండం వద్దే కాయలు విరగ్గాసి ఆకర్షిస్తోంది. అంజూర అంటును నాటిన మూడేళ్లకు 5 నుంచి 6 కిలోల దిగుబడి ఇస్తుంది.

విశాఖ జిల్లా అరకు సంతబయలులో జరిగిన వారపు సంతలో పనసకు గిరాకీ ఏర్పడింది. మైదాన ప్రాంత వ్యాపారులు ఎగబడి వీటిని కొనుగోలు చేశారు. ఒక్కో పనస రూ.80 నుంచి రూ.120 వరకు ధర పలికింది. దీంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేశారు. 

వరంగల్‌ నగరాన్ని స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్దే క్రమంలో బల్దియా అధికారులు కూడళ్ల సుందరీకరణ చేపట్టారు. అందులో భాగంగా జవహర్‌నగర్‌ కూడలి వద్ద పక్షుల ప్రతిమలతో ఫౌంటెన్‌ ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో హంసల నోటిలో నుంచి నీళ్లు ఎగజిమ్ముతూ రంగు రంగుల విద్యుత్తు దీపాల కాంతిలో ఆకట్టుకునేవి.

హైదరాబాద్‌.. ఉప్పల్‌లోని హైకోర్టు కాలనీలోని పెద్ద చెరువు అలుగు వద్ద మంచు దుప్పటి కప్పుకున్నట్లు తలపిస్తోంది. అలా అనుకుంటే భ్రమించినట్లే. మంచినీటి చెరువు కాస్త విష రసాయనాలు కలిసిపోయి ప్రజలకు నరకాన్ని చూపిస్తోంది.

హైదరాబాద్‌ నగరంలో కొందరు ద్విచక్ర వాహనాలపై ప్రమాదకరంగా భారీ వస్తువులను తరలిస్తూ పక్కవారికి ఇబ్బందులు కలిగిస్తున్నారు. వనస్థలిపురంలో పొడవాటి తలుపులతో వెళ్తున్న ఈ దృశ్యం కనిపించింది.

నిత్యం ఏదో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా.. చాలామంది గుణపాఠాలు నేర్వడం లేదు. మెదక్‌ పట్టణంలో ఓ వ్యక్తి మేకను ద్విచక్రవాహనంపై ప్రమాదకరంగా తీసుకెళుతూ చరవాణిలో మాట్లాడుతుండగా.. ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మనిపించింది.

పింఛన్ల పెంపు కోసం ధర్నా చేయడానికి వివిధ గ్రామాల నుంచి కొంగరకలాన్‌లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌కు వచ్చిన దివ్యాంగులు, వృద్ధులు వీరు. ఎండ తీవ్రతకు తట్టుకోలేక కలెక్టరేట్‌ ఎదుట ఉన్న చెట్ల నీడకు చేరారు.

కల్కి సినిమాలో ప్రభాస్‌ ఉపయోగించిన రోబో కారు (బుజ్జి కారు) విశాఖ వ్యాలీ పాఠశాలకు వచ్చి క్రీడా మైదానంలో చక్కర్లు కొట్టింది. దీంతో విద్యార్థులు కేరింతలతో సందడి చేశారు. అనంతరం కారు ఎక్కి సంతోషాన్ని పంచుకున్నారు. సెల్ఫీలు దిగి పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు.

అలవాటుగా మారిందేదీ కష్టంగా అనిపించదు

చిత్రం చెప్పే వార్తలు (21-10-2024)

మీ జీవితపు స్టీరింగును వేరొకరికి ఇవ్వొద్దు

Eenadu.net Home