చిత్రం చెప్పే విశేషాలు
(07-07-2024)
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన జగన్నాథ రథయాత్రను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.
గోల్కొండలోని జగదాంబికా అమ్మవారి ఆలయం వద్ద బోనాల సందడి నెలకొంది. మహిళలు పెద్దఎత్తున బోనాలతో అక్కడికి చేరుకున్నారు. అమ్మవారికి బోనం సమర్పించేందుకు మంత్రులు పొన్నం, కొండా సురేఖ, ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ విజయలక్ష్మి తదితరులు ఉత్సవాల్లో పాల్గొన్నారు.
ఎక్కడైనా రైలు పట్టాలపైనే ప్రయాణిస్తుంది. ఇక్కడ మాత్రం లారీ ఎక్కేసింది. సికింద్రాబాద్ రైల్ నిలయం సమీపంలోని సంచాల్ భవన్ ఆవరణలో నమూనాగా ఏర్పాటు చేయడానికి లాలాగూడ నుంచి ఇలా తీసుకెళ్తుండగా కనిపించింది. ఆ మార్గంలో రాకపోకలు సాగించే వారు ఆసక్తిగా తిలకించారు.
మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్‌గ్యాలరీలో ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శన చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. 24 హవర్స్ ప్రాజెక్ట్ అనే సంస్థ ప్రతి ఏటా వేర్వేరు దేశాల్లో ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేస్తోంది. 125 ఉత్తమ ఫోటోలు ఇక్కడ కొలువుదీరాయి.
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం చిన్నదేవాడలో రైతులు వినూత్నంగా ఆలోచించి కలుపు తీస్తున్నారు. చేనులో కలుపు తీయడానికి అర్థికంగా ఖర్చు ఎక్కువ అవ్వడంతో పాటు సకాలంలో కూలీలు దొరకడం లేదు. ఈ నేపథ్యంలో ఎద్దుల సహాయంతో ఐదుగురు రైతులు కలిసి కురిపేలతో కలుపు తీస్తున్నారు.
హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌కు వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు వేంకటేశ్వరస్వామి ప్రతిమను బహూకరించారు.
కైలాస గిరి కొండపై నుంచి తిలకిస్తే ప్రకృతి ఒడిలో ఒదిగిన నగర శోభ అబ్బురపరుస్తుంది. భారీ భవంతులు.. వాటి మధ్య పచ్చదన సొబగులు.. మరో వైపు సాగర తీర అందాలు చూడాలంటే రెండు కళ్లూ చాలవంటున్నారు ప్రకృతి ప్రేమికులు. విశాఖ నగరాన్ని, నీలి సంద్రాన్ని కన్నార్పకుండా చూస్తూ మైమరచిపోతుంటారు.
విశాఖ జిల్లా నక్కపల్లి, ఎస్.రాయవరం మండలాల్లో శనివారం సాగిన చేపల వేటలో మేలు జాతి చేపలు లభించడంతో మత్స్యకారులకు కాసుల పంట పండింది. ఇందులో ఖరీదైన చందువా, వంజరం, లెదర్ జాకెట్, అపోలో ఫిష్‌లతోపాటు కలివిందలు, పీతలు, కానకడతలు తదితర చేపలు లభించాయి.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అంబారుపేట గ్రామంలో భారత క్రికెట్ జట్టు పూర్వపు సారథి మహేంద్రసింగ్ ధోనీ 100 అడుగుల కటౌట్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన ఈ కటౌట్ వాహనచోదకులు, ప్రయాణికులను ఆకట్టుకుంటోంది.
వర్షాలే లేవు.. నదీ ప్రవాహం ఎక్కడనుకుంటున్నారా? మీరు నీటిలో కాలేసినట్లే? అది జల ప్రవాహం కాదండోయ్.. సోలార్ విద్యుత్తు ఫలకలు. ఎత్తైన కొండలు.. చుట్టూ పచ్చని పొలాల మధ్య ఓ కంపెనీ వారు ఏర్పాటు చేసిన సోలార్ ఫలకలు ఇలా ఆకట్టుకుంటున్నాయి.