చిత్రం చెప్పే విశేషాలు

(08-07-2024)

 శేషాచలం కొండల్లో ఇటీవల కురుస్తున్న వర్షాలకు తేమ శాతం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో వివిధ రకాల సీతాకోకచిలుకలు గుంపులుగా వాలి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద, తిరుమల శ్రీవారి దర్శనార్థం కనుమ దారిలో ఇవి ఆకులను తలపిస్తూ మొక్కలపై వాలి కనువిందు చేస్తున్నాయి.

కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన బోడపట్ల మల్లవ్వ అనే వృద్ధురాలు తన ఇంటి పక్కన ఉన్న మూడు గుంటల్లో మిరపనారు నాటుకున్నారు. ఎండలకు ఆ మొలకలు ఎండిపోతున్నాయి. వాటిని దక్కించుకోవాలన్న ఆశతో ఇలా పైపు ద్వారా నీటిని అందిస్తున్నారు.

లండన్‌లో వింబుల్డన్‌ సందర్భంగా టెన్నిస్‌ స్టార్‌ రోజర్‌ ఫెదరర్‌తో భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ దిగిన ఫొటో నెట్టింట వైరల్‌ అయ్యింది.

కన్నడనాట కురుస్తున్న జోరు వానలకు అన్నదాతలు ఉత్సాహంగా సేద్యపు పనులు ప్రారంభిస్తున్నారు. చాలా చోట్ల పొలం పనులు ఊపందుకున్నాయి. చిక్కమగళూరు జిల్లాలో ఓ రైతు కుటుంబం తన పొలంలో విత్తనాలు విత్తుతుండగా న్యూస్‌టుడే క్లిక్‌ మనిపించింది.

సాధారణంగా బొప్పాయి చెట్టుకు అనుకొని కాయలు కాస్తుంటాయి. కానీ ఈ మూడు బొప్పాయి చెట్లు మాత్రం పొడవాటి తీగలతో కాయలను విరగకాశాయి. ఈ చెట్లు కుమురం భీం జిల్లా కెరమెరి మండలంలోని పరందోలి గ్రామంలో పవర్‌ రమేశ్‌ ఇంటి ఆవరణలో పెరిగి చూపరులను ఆకట్టుకుంటున్నాయి. 

ఇటీవల కురిసిన వర్షాలకు వైఎస్సార్‌ జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట అలుగు పారుతోంది. ఇక్కడ చేపల కోసం వందల సంఖ్యలో సైబీరియన్‌ కొంగలు వలస వస్తున్నాయి. దీంతో కొంగల సందడి చూపరులను కనువిందు చేస్తోంది. 

సగటు జాలరి జీవనానికి అద్దం పట్టే ఈ చిత్రం వరంగల్‌ జిల్లా ఖిలావరంగల్‌ పడమరకోట మాలారుగుర్త చెరువులో కనిపించింది. మధ్యాహ్న వేళ తమ జీవన వేటలో నిమగ్నమైన దృశ్యాన్ని ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మనిపించింది.

ఈ చిత్రంలో తాబేలు ఆకారంలో కనిపిస్తున్నది పులగంద గడ్డ. ఆదిలాబాద్‌ జిల్లా మందమర్రి టీనగర్‌ కాలనీలో స్రవంతి అనే మహిళ కూరగాయల మార్కెట్‌లో పులగంద గడ్డను కొనుగోలు చేసి ఇంటికి తీసుకొచ్చింది. ఈ విషయాన్ని కాలనీవాసులకు తెలియజేయడంతో వారు వచ్చి ఆసక్తిగా తిలకిస్తున్నారు.

వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలం దీక్షకుంట గ్రామానికి చెందిన దేసు లక్ష్మణ్‌ అనే వ్యక్తి ఇంటి ఆవరణలోని మందార చెట్టుకు పూసిన రెండు వేర్వేరు రంగుల పూలు స్థానికులను ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా ఈ చెట్టుకు నిత్యం గోధుమ రంగు పుష్పాలు పూస్తుంటాయి.

ఖమ్మం జిల్లా కొణిజర్లకు చెందిన అనంతోజు రామాచారి ఇంటి ఆవరణలో ఉన్న పండ్లు, పూల మొక్కల మధ్యలో పక్షులు గూళ్లు ఏర్పాటు చేసుకుని రక్షణ పొందుతున్నాయి. కొన్ని రకాల పిచ్చుక జాతి పక్షులు గూళ్లలో గుడ్లు, పిల్లలతో కిలకిల రావాలతో సందడి చేస్తున్నాయి.

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home