చిత్రం చెప్పే విశేషాలు

(10-07-2024)

విశాఖ నగరంలో ప్రమాదాల నివారణకు పోలీసులు విభిన్న పద్ధతుల్లో ప్రజలను చైతన్యం చేస్తున్నారు. శిరస్త్రాణం తప్పనిసరని, అది ప్రాణాలను కాపాడుతుందని వివరిస్తున్నారు. అదే విషయాన్ని పేర్కొంటూ ప్రధాన మార్గాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆలోచింపజేస్తున్నాయి.

హైదరాబాద్‌లోని తార్నాక ఫ్లైఓవర్‌ బ్రిడ్జికి ఇరువైపులా గోడలపై పిల్లలు పుస్తకాలు చదువుకుంటున్నట్లుగా వేసిన రంగుల చిత్రాలు ఈ మార్గంలో వెళ్లేవారందరిని ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రాలను చూస్తూ విద్యార్థినులు వెళుతున్న చిత్రమిది.

విశాఖ జిల్లా హుకుంపేట గిరిజన ప్రాంతాల్లో వరినాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పొలాల్లో నీరు సమృద్థిగా చేరటంతో వ్యవసాయ పనుల్లో గిరి రైతులు నిమగ్నమయ్యారు. 

విశాఖ జిల్లా విశాలాక్షినగర్ పదోవార్డు పరిధిలోని పాతడెయిరీఫారం కూడలిలో పల్లె వాతావరణాన్ని తలపించేలా జీవీఎంసీ ఆధ్వర్యంలో బొమ్మల విగ్రహాలు ఏర్పాటు చేశారు. కొత్తగా విగ్రహాలు ఏర్పాటు చేయటంతో రాకపోకలు సాగించే వారి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

 

మేఘం గగనయానం చేసింది. ప్రకృతి రమణీయతను జోడించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని రథంగుట్టపై ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. కనువిందు చేసిన ఆ చిత్రాన్ని ‘న్యూస్‌టుడే’ క్లిక్‌ మనిపించింది. 

లారీకి 10.. 20 కాదు ఏకంగా 90 చక్రాలు ఉండటం ఆ దారిన వెళ్లేవారిని అబ్బురపరిచింది. రాజమహేంద్రవరం లాలాచెరువు జాతీయ రహదారిపై కనిపించిన ఈ వాహనం విశాఖ పోర్టుకు భారీ యంత్రాన్ని తీసుకెళుతోంది. వెనక 80 చక్రాలతోపాటు ఇంజెన్‌కు మరో 10 కలిపి మొత్తం 90 చక్రాలున్నాయి. 

ఇటీవల హైదరాబాద్‌తో పాటు ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వచ్చిన వరద మూసీ ప్రాజెక్టులోకి చేరుతోంది. నల్గొండ జిల్లాలో అన్ని ప్రాజెక్టుల్లో నీళ్లు లేకపోయినా.. మూసీలో మాత్రం జలకళ సంతరించుకుంది. ప్రస్తుత నీటి మట్టం 638 అడుగులకు చేరుకుంది. దీని గరిష్ఠ నీటి మట్టం 645 అడుగులు. 

నల్గొండ జిల్లా మునుగోడు మండలం కొంపల్లి గ్రామానికి చెందిన గోలి రామలింగం తనకున్న నాలుగు ఎకరాలలో పత్తి సాగు చేశారు. ఓ బోరు ఉన్నప్పటికీ నాలుగు ఎకరాలకు సరిపడా నీరు అందడం లేదు. దీంతో చేసేదేమీ లేక ఎకరానికి స్పింక్లర్లు ఏర్పాటు చేసి తుంపర సేద్యం ద్వారా నీటిని అందిస్తున్నాడు.

శాకాంబరి ఉత్సవాల్లో భాగంగా వరంగల్‌ జిల్లా పద్మాక్షి కాలనీలోని శ్రీహనుమద్గిరి పద్మాక్షి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారికి 10,008 గాజులు, పలు రకాల పండ్లు, కూరగాయలతో అలంకరించారు.

విశాఖ జిల్లా చింతపల్లి సాయినగర్‌లోని ప్రార్థనా మందిరం వద్ద చెట్టంతా ఎర్రని పూలతో ఓ మొక్క అందరినీ ఆకట్టుకుంటోంది. ‘చైనీస్‌ ఇక్సోరా’ జాతికి చెందిన ఈ మొక్కలు ఆకట్టుకునేలా వివిధ రంగుల్లో పూలను పూస్తాయని ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త తెలిపారు.  

అలవాటుగా మారిందేదీ కష్టంగా అనిపించదు

చిత్రం చెప్పే వార్తలు (21-10-2024)

మీ జీవితపు స్టీరింగును వేరొకరికి ఇవ్వొద్దు

Eenadu.net Home