చిత్రం చెప్పే విశేషాలు
(12-07-2024)
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ జన్మదినం సందర్భంగా కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామానికి చెందిన భాజపా యువమోర్చా జిల్లా కార్యదర్శి బోనాల సాయికుమార్ ఒడిశాలోని పూరీ తీరంలో బండి సంజయ్ సైకతశిల్పాన్ని ఏర్పాటు చేశారు.
విశాఖ నగరంలో జరిగిన ఓ వాణిజ్య కార్యక్రమంలో యువనటి మీనాక్షి చౌదరి పాల్గొని సందడి చేశారు.
విజయవాడ స్క్యూబ్రిడ్జి వద్దనున్న ఇస్కాన్ మందిరంలో మూడు రోజులపాటు వేడుకలు, రథయాత్ర జరగనున్నాయి. ఇందులో భాగంగా సీతానగరానికి చెందిన ఆకునూరు బాలాజీ ఇస్కాన్ మందిరం ఆవరణలో ఇసుకతో జగన్నాథ స్వామి సైకతాన్ని తీర్చిదిద్దారు.
విజయనగరం జిల్లా వంగర మండలంలోని ఇరువాడ- కింజంగి మధ్య వారధి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే ప్రమాదమైనా ప్రజలు ప్రతి రోజూ ఇలా ప్రయాణిస్తున్నారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపాన పెన్నానదికి అటు ఇటు నీరు నిలిచిన కుంటల్లో రజకులు దుస్తులు ఉతికి జీవనం సాగించేవారు. అక్కడక్కడ ఏర్పాటు చేసుకున్న ధోబీఘాట్లు, కుంటల్లో దుస్తులు ఉతికి ఇసుక తెన్నెలపై ఆరేయడంతో రంగుల తోరణాలతో చూపరులను ఆకట్టుకుంటోంది.
విశాఖ జిల్లా మన్యంలో ఎటు చూసినా ప్రకృతి అందాలే కనిపిస్తుంటాయి. జడ్డంగిలోని ఒక వీధిలో తాటిచెట్టుకు పక్షుల గూళ్లు అందంగా కట్టుకున్నాయి. అందంగా ఉండటంతో స్థానికులు వీటిని ఫొటోలు తీస్తున్నారు.
కర్ణాటకలోని సింధనూరులో ఆకాశాన కనిపించిన రెండు ఇంద్రధనస్సులు కనువిందు చేశాయి. సాయంత్రం సమయంలో కాస్తంత చినుకులు రాలగా కొద్ది క్షణాల్లోనే ఆకాశంలో ఏర్పడిన ఈ రెండు ఇంద్రధనుస్సులను చూసి జనం పరవశించి కేరింతలు కొట్టారు.
ఆర్టీసీలో కాలం చెల్లిన బస్సులతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. విశాఖ జిల్లా ఏజెన్సీలో ప్రయాణిస్తున్న బస్సులు తరచూ మరమ్మతులకు గురై ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. గుమ్మలక్ష్మీపురం నుంచి పార్వతీపురం వెళ్లే ఆర్టీసీ బస్సు ఆగిపోవడంతో స్థానికులు, సిబ్బంది నెడుతూ కనిపించారు.
శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా జగన్నాథస్వామి రథోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ ఆలయాల్లో వేడుకల్లో భాగంగా హీరాపంచమి వేడుకలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. నరనన్నపేటలోని వెంకటేశ్వరాలయంలో నరసింహావతారంలో జగన్నాథుడు భక్తులకు దర్శనమిచ్చాడు.
భారత రక్షణ శాఖకు చెందిన యుద్ధ ట్యాంకులు రైలెక్కాయి. చెన్నై నుంచి నెల్లూరు మీదుగా విశాఖపట్నం వైపు గూడ్సు రైలులో భారీ సంఖ్యలో వెళ్లాయి. వీటిని నగర ప్రజలు ఆసక్తిగా తిలకించారు.
రహదారి మీదుగా వెళ్లే ప్రయాణికుల మనసును దోచేలా ఉన్న ఈ చిత్రాలు జనగామ జిల్లా ముఖద్వారం పెంబర్తి శివారు ఏకశిలా కళా తోరణం వద్ద ఉన్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు పూల మొక్కలు.. రంగు రంగుల పుష్పసోయగంతో, తోరణం కొత్త అందాలను సంతరించుకుంది.