చిత్రం చెప్పే విశేషాలు
(13 - 07 - 2024)
విశాఖ జిల్లా చింతపల్లి ఏకలవ్య పాఠశాల ప్రిన్సిపల్ అన్నామణి కడియం నుంచి కొన్ని పూల, అలంకరణ మొక్కలు తెప్పించి పాఠశాల ప్రాంగణంలో నాటించారు. వాటిలో రాఖీ పుష్పాలు ఇలా వికసించి అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి శివారులో రైతు లింగయ్య ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పత్తి చేనులో గుంటుక దున్నాడు. ఆకలి వేయడంతో మధ్యాహ్న సమయంలో కాసేపు అరకను ఆపి.. ఇలా భోజనం చేశాడు.. ఈ దృశ్యాన్ని ‘న్యూస్‌టుడే’ తన కెమెరాలో బంధించింది.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని వశిష్ట గోదావరిలో మలికిపురం మండలం రామరాజులంక గంగపుత్రుల వలలో సుమారు కేజీన్నర బరువున్న పులస చేప చిక్కింది. మాజీ సర్పంచి బర్రే శ్రీను రూ.24 వేలు పెట్టి దీన్ని కొనుగోలు చేశారు.
చైనాకి చెందిన డ్రోన్ తయారీ సంస్థ డీజేఐ గ్లోబల్.. డ్రోన్ సాయంతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరంపై అద్భుతమైన వీడియోను చిత్రీకరించింది. సముద్రమట్టానికి 3,500 మీటర్ల ఎత్తులో ఉన్న బేస్ క్యాంప్ నుంచి ఎవరెస్టు శిఖరానికి సంబంధించిన దృశ్యాలను డ్రోన్ చిత్రీకరించింది.
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం గ్రామీణం పరిధి నల్లమిల్లిలోని సత్తెమ్మతల్లిని ఆషాఢ మాసం సందర్భంగా అరటి పండ్లతో శుక్రవారం ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారిని భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ అలంకరణ విశేషంగా ఆకట్టుకుంది.
నారాయణపేట జిల్లా మాగనూరు, కృష్ణా మండలాల్లో కృష్ణాతీర ప్రాంతంలో భారీ మొత్తంలో రైతులు వరి సాగు చేస్తున్నారు. కృష్ణా మండలం ముడుమాల్ శివారులో గోరఖ్‌పుర్, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన యువకులు నాట్లు వేస్తున్న దృశ్యాన్ని ‘ఈనాడు’ క్లిక్ మనిపించింది.
అనంతపురంలో సినీతారలు నిధి అగర్వాల్, అనసూయ సందడి చేశారు. టవర్ క్లాక్ సమీపంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 35వ షోరూమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సినీతారలు పాల్గొని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. వారిని చూడటానికి యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం దగడపల్లి గ్రామానికి చెందిన మహిళా రైతు ఈశ్వరమ్మ మూడు ఎకరాల్లో వరిసాగుకు నారుమడిని చదును చేసిన పొలంలో వడ్లు చల్లారు. వీటిని పక్షులు నుంచి రక్షించుకునేందుకు నారుమడిని చీరలతో కప్పేశారు.
కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో తుంగభద్ర నదిలో నీరు పారుతున్నా కల్లుదేవకుంట గ్రామానికి శుద్ధి చేసిన నీటిని అందించడంలో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ఫలితంగా గ్రామస్థులు 4 కి.మీ. దూరంలోని చిలకలదోణ గ్రామానికి వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు.
శ్రీపద్మావతి మహిళా వర్సిటీలో బి.ఒకేషనల్ ఫ్యాషన్ టెక్నాలజీ అండ్ అప్పరల్ డిజైనింగ్ కోర్సు విద్యార్థినులు ‘లోటస్ డిజైనర్ షో-2024’ పేరుతో నిర్వహించిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. సంప్రదాయ, ట్రెండింగ్ దుస్తులు ధరించి నృత్యాలు వేస్తూ.. హొయలొలికే నడకలతో అలరించారు.
ఉత్తరప్రదేశ్‌లోని గోరక్‌పూర్‌కు చెందిన ఈ వ్యక్తి అబ్దుల్ మజీద్. విజయవాడలో ఓ బేకరిలో తయారు చేసిన బిస్కెట్లను నాలుగు చక్రాల బండిపై పెట్టుకుని ఇలా తాడుతో లాగుతూ కాలినడకన వస్తున్నాడు. ఆ దృశ్యాన్ని ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మనిపించింది.