చిత్రం చెప్పే విశేషాలు
(14-07-2024)
ఖమ్మం నగరంలోని వైరారోడ్డులో సినీ నటి సంయుక్త ఓ నూతన ఆభరణాల షోరూంను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సినీ నటిని చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు.
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ఇమాంకొమిని వద్ద ఇనుప జాలిలో రాళ్లను వేసి అందమైన బొమ్మగా తీర్చిదిద్దారు. చేతిలో కపోతం శాంతి సందేశం చెబుతున్నట్లు ఉంది.
పచ్చదనం వెల్లివిరిసేలా రైతులు వరి పంట సాగు చేపట్టారు. పొలం పక్కన ప్రయాణిస్తున్న రైలును చూసిన వారికి కొత్తకొత్తగా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. మెదక్ జిల్లా సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి శివారులో కనిపించింది ఆకట్టుకునే ఈ దృశ్యం.
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండలం తోషం గ్రామ శివారులో పంటలను చూసేందుకు రైతు ప్రధాన రహదారి పక్కన తన ద్విచక్ర వాహనాన్ని నిలిపాడు. అదే సమయంలో రోడ్డు పక్కన వెళుతున్న కొండముచ్చు ద్విచక్ర వాహనంపై దర్జాగా కూర్చుండిపోయింది. అటుగా వెళుతున్న వారు ఆసక్తిగా తిలకించారు.
కావేరి నదీ పరివాహక ప్రాంతంలో ఎడతెగని వానలు కురుస్తున్నాయి. కర్ణాటకలోని కృష్ణరాజసాగర, హేమావతి, కబిని, హారంగి జిలాశయాల్లోకి వరద పోటెత్తుతోంది. కబినీ జలాశయానికి భారీగా వరద చేరడంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
పూరీకి చెందిన ప్రముఖ శిల్పి, పద్మశ్రీ అవార్డు గ్రహీత సుదర్శన్ పట్నాయక్ రష్యాలో పసిడి పతకం సాధించారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన అంతర్జాతీయ సైకత శిల్ప ప్రదర్శన పోటీలో పాల్గొన్న సుదర్శన్ తన నైపుణ్యంతో విజేతగా నిలిచారు.
ద్విచక్రవాహనాలపై వెనుక కూర్చున్న వారూ శిరస్త్రాణం ధరించాలన్న నిబంధనను అక్షరాల పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు పలువురు వాహనదారులు. కూకట్‌పల్లి జేఎన్‌టీయూ రోడ్డులో బైకులపై వెనక కూర్చున్న ఓ పోలీసు, యువతితోపాటు చిన్నారి కూడా హెల్మెట్ ధరించి వెళుతూ కనిపించారు.
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్ నుంచి బద్దిపల్లి మధ్య ఉన్న చిన్న కొండలపై పూలతోటలా కనువిందు చేస్తున్న మొక్కలు అందరినీ ఆకట్టుకొంటున్నాయి. సమీపంలో నివాసముండే చిన్నారులు ఈ పూల వనంలో సరదాగా ఆడుకుంటున్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టంలో భారీ వర్షం కురవడంతో జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణం ఇలా నిండిపోయింది.