చిత్రం చెప్పే విశేషాలు
(15-07-2024)
పూరీ శ్రీక్షేత్ర రత్నభాండాగారం తెరుచుకున్న నేపథ్యంలో ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ శిష్యులు పూరీ తీరంలో భాండాగారం సైకత శిల్పం తీర్చిదిద్దారు. ఇది సందర్శకులను ఆకట్టుకుంది.
జింబాబ్వేతో ఐదు టీ20ల సీరిస్‌లో భాగంగా జరిగిన చివరి మ్యాచ్‌లోనూ భారత్ విజయం సాధించింది. ఆతిథ్య జట్టుపై 42 పరుగులతో గెలిచింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియా 167/6 స్కోర్ చేయగా.. లక్ష్యఛేదనలో జింబాబ్వే 18.3 ఓవర్లకు 125 పరుగుల వద్ద ఆలౌటైంది
తమిళనాడు రాష్ట్రం రాణిపేట జిల్లా అరక్కోణం పట్టణం ఎస్సార్‌గేట్‌కు చెందిన గౌరీశంకర్, భువనేశ్వరి దంపతుల కుమార్తె మగియిని (22 నెలలు) ఆంగ్ల అక్షరాలు, జంతువులు, అంకెలు, శరీరంలోని అవయవాలు, పక్షుల పేర్లను అలవోకగా చెబుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఈచిత్రం చూశారా! ఇదేమిటీ ఏటీఎం కేంద్రంలో ఆవు ఉందనుకుంటున్నారా! అదేమరి విశేషం. వర్షం కురుస్తుండగా.. సమీపంలోని ఉన్న ఏటీఎం కేంద్రంలోకి వెళ్లి ఇలా సేదదీరింది. ఈదృశ్యం నెల్లూరు జిల్లాలోని అల్లూరు గ్రామంలోని బ్యాంకు కూడలిలో ‘న్యూస్‌టుడే’ కెమెరాకి చిక్కింది.
వానాకాలం వరి సాగు పనులు ఊపందుకున్నాయి. అడపాదడపా వర్షాలు కురుస్తుండటంతో రైతులు నాట్లు వేసుకుంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇప్పటి వరకు 56 వేల ఎకరాల్లో వరినాట్లు వేశారు.
గోదావరి పరీవాహకంలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నదీ ప్రవాహం పెరుగుతుంది. పైనుంచి వచ్చే జలాలతో ఎరుపు వర్ణాన్ని సంతరించుకుని సరికొత్తగా కనువిందు చేస్తోంది. రాజమహేంద్రవరం వద్ద పరవళ్లు తొక్కుతున్న అఖండ గోదావరిని ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
వర్షాలతో విశాఖ జిల్లాలోని కొత్తపల్లి జలపాతం ఉరకలెత్తుతోంది. వర్షపు నీటితో ఉద్ధృతంగా ప్రవహిస్తూ కొత్త అందాలు సంతరించుకుంది. పర్యటకులు ఇక్కడి అందాలు వీక్షించి మంత్రముగ్ధులవుతున్నారు.
అనంతపురం కలెక్టరేట్ ఎదురుగా ఉన్న బుక్కరాయసముద్రం చిక్కవడయార్ చెరువులో విదేశీ విహంగాలు సందడి చేస్తున్నాయి. చెరువులో నీరు తక్కువగా ఉండటంతో వీటికి ఆహారం సులువుగా దొరుకుతుండటంతో అధిక సంఖ్యలో పక్షులు కనువిందు చేస్తున్నాయి.
ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి దట్టమైన అటవీ ప్రాంతంలోని జలపాతం వద్ద నీటిధారలను తిలకించిన సందర్శకులు తన్మయత్వం చెందారు. కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి సరదాగా ఈదుతూ.. కేరింతలు కొట్టారు.
నెల్లూరు జిల్లా గుడ్లూరులో స్థానిక ఆర్యవైశ్య కల్యాణ మండపం వద్ద భారీ వేప చెట్టు అకస్మాత్తుగా ఎండిపోయింది. చుట్టు పక్కల వారికి చల్లదనాన్ని ఇస్తున్న చెట్టు ఇలా అవడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.