చిత్రం చెప్పే విశేషాలు

(17-07-2024)

కర్నూలులోని దూపాడు వద్ద జాతీయ రహదారి పక్కన ఎయిర్‌బస్‌ రెస్టారెంట్‌ ఏర్పాటు చేశారు. ఆహార ప్రియులకు సరికొత్త అనుభూతి అందించేందుకు ఈ ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. వినియోగదారులు విమానంలో గడిపిన అనుభూతి కలిగించేలా ఏర్పాట్లు చేశారు.

ములుగు జిల్లా వాజేడు మండలంలో కురిసిన భారీ వర్షంతో బొగత జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తోంది. పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చి జలపాతం అందాలను వీక్షిస్తున్నారు. 

నిజామాబాద్‌ నగర శివారు పరిశ్రమల నుంచి వెలువడే రసాయన వ్యర్థాలను నిర్వాహకులు పూలాంగ్‌ వాగులోకి వదులుతున్నారు. ఫలితంగా నీరు కలుషితమై ఆకుల కొండూర్‌ గ్రామ శివారులో ఉన్న చెక్‌ డ్యాం వద్దకు వచ్చి చేరుతోంది. దిగువకు వదులుతున్న సమయంలో ఇలా పాల వలె నురగ పేరుకుపోతోంది. 

ఎక్కడ చూసినా పూలపై రంగురంగుల సీతాకోకచిలుకలు గుంపులు గుంపులుగా కనిపిస్తున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం పుల్లూరు వద్ద తుంగభద్ర తీరంలో తుమ్మచెట్టుకు విరిసిన పూలపై గుంపులుగా ఉన్న సీతాకోకచిలుకలను ‘ఈనాడు’ క్లిక్‌ మనిపించింది.

మహబూబ్‌నగర్‌ జిల్లా తిమ్మాజిపేట మండలం అప్పాజిపల్లి సమీప అప్పాద్రి కొండపై ఓ నెమలి పురివిప్పి నాట్యమాడింది. నరసింహస్వామి దర్శనానికి వెళ్లే భక్తులు కొద్దిసేపు అలికిడి కాకుండా అక్కడే నిల్చోని నెమలినాట్యం చేస్తుండగా ఆసక్తిగా తిలకించారు.

నెల్లూరులో రొట్టెల పండుగ ప్రారంభమైంది. బారాషహీద్‌ దర్గా వద్దకు భక్తులు భారీగా చేరుకున్నారు. ఊరించే వరాల రొట్టెను అందుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చారు. స్వర్ణాల చెరువులో పుణ్యస్నానాలు చేశారు. అనంతరం కోర్కెల రొట్టెలు పంచుకున్నారు.

ఆదిలాబాద్‌ పట్టణంపై దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. దీంతో చీకటి అలుముకుంది. తప్పనిసరి కావడంతో పలు ఇళ్లల్లో విద్యుత్తు దీపాలు వెలిగించాల్సి వచ్చింది. మరోవైపు చిరు జల్లులతో పాటు అప్పుడప్పుడూ పెద్ద వర్షం కురిసింది. 

తొలిఏకాదశి, మొహర్రం(పీర్ల) పండుగల సందర్భంగా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ పట్టణానికి చెందిన పత్ర చిత్రకారుడు గుండు శివకుమార్‌ రావి ఆకులపై సంబంధించి పండుగల ఆకృతులను తీర్చిదిద్దారు.

ఆదిలాబాద్‌ జిల్లా తిర్యాణి మండలంలోని చింతపల్లిలోని గాడిపెల్లి అంజయ్య ఇంటి ఆవరణలోని బొప్పాయి చెట్టు 8 అడుగుల ఎత్తుతో ఉండి నిండా కాయలు, పిందెలు, పూతతో కళకళలాడుతోంది. కాయ పక్వానికి వచ్చే వరకు దాదాపు 500 పండ్లు కావచ్చని ఆయన అంచనా వేస్తున్నారు. 

ఒక్కొక్కరు అరడజనకు పైగా ఇనుప మంచాలను కట్టుకొని రాయలసీమ నుంచి కోస్తా వైపు సాగిపోతున్నారు. అనంతపురం- గుంటూరు జాతీయ రహదారిపై వెళ్తున్న కష్టజీవుల జీవన సౌందర్యాన్ని ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మనిపించింది.  

విశాఖ జిల్లా మోతుగూడెంలో పదిహేను రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పొల్లూరు జలపాతం ఉరకలేస్తూ పర్యటకులకు కనువిందు చేస్తోంది. అధిక సంఖ్యలో సందర్శకులు జలపాతాన్ని వీక్షించటమే కాకుండా అక్కడ జలధారలో స్నానాలు చేస్తూ కేరింతలు కొట్టారు. 

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home