చిత్రం చెప్పే విశేషాలు

(18-07-2024)

ఎమ్మెల్యేగా ఎన్నికైనా హంగూ ఆర్భాటాలు, భద్రతా సిబ్బంది, కాన్వాయ్‌ వంటి హడావుడికి దూరంగా.. సగటు మధ్య తరగతి మహిళగా ద్విచక్ర వాహనంపై నియోజకవర్గంలోని డివిజన్‌ పర్యటనలకు శ్రీకారం చుట్టారు తెలుగుదేశం పార్టీకి చెందిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి.

కాప్రా సర్కిల్‌ నాచారంలోని అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన చిరు వ్యాపారి కుమారుడు సంజయ్‌ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.  పాఠశాల నుంచి వచ్చాక తండ్రికి ఆసరాగా ఉంటాడు. ఓ వైపు కూరగాయలు అమ్ముతూనే చదువునూ పూర్తి చేసుకుంటూ ఇలా కనిపించాడు.  

సీతాపహరణం తర్వాత ఆమె జాడ కోసం వెతుకుతున్న శ్రీరామచంద్రుడుకి కొండపైన రెక్కలు తెగి పడి ఉన్న జఠాయువు కనిపించింది. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వినుకొండకు చెందిన చిత్రకారుడు బి.ప్రసాదరావు ఈ కథకు చిత్రరూపం ఇచ్చారు.  

పశ్చిమగోదావరి జిల్లా కైకలూరు మండలం భుజబలపట్నంలోని మంచినీటి చెరువులో చేపల పట్టుబడిలో 12 కిలోల భారీ బొచ్చెలు అందరి దృష్టిని ఆకట్టుకున్నాయి. ఇదే పట్టుబడిలో 10 కిలోల బరువున్న చేపలు వంద వరకు దొరకడం విశేషం.

గూడు కట్టుకోవడంలో పక్షి జాతుల్లో గిజిగాడికి సాటిలేదు. వీవర్‌ బర్డ్‌గా పిలిచే ఈ పిచ్చుకలు.. మెదక్‌ జిల్లా దుబ్బాక పట్టణంలోని మాలకుంటలో ఒక చెట్టుపై వేలాడేలా 25 గుళ్లను నిర్మించుకున్నాయి. ఒకే చెట్టుపై చిన్న కాలనీ లాగా గూళ్లను నిర్మించుకోవడం విశేషం.  

తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయాల్లో రద్దీ నెలకొంది. కర్నూలు నగరంలో వెంకటరమణ కాలనీలోని వెంకటేశ్వర ఆలయంలో స్వామి అమ్మవార్లను స్వర్ణాభరణాలతో అలంకరించారు.

వర్షాలు కురుస్తుండటంతో చెక్‌డ్యాంలు, చెరువుల్లోకి వరద చేరుతోంది. కరీంనగర్లోని గద్దపాక చెక్‌డ్యాం జలకళ సంతరించుకుంది. ఎరడపల్లి పాత చెరువు నీటితో కళకళలాడుతుండగా అలుగు పారుతోంది.

పెద్దపెద్ద కలలు కనడం, వాటిని సాకారం చేసుకోవడంలో సైన్స్‌ కీలకపాత్ర పోషిస్తుందని తిరుపతి కమిషనర్‌ అదితిసింగ్‌ విద్యార్థులకు సూచించారు. తిరుపతి సైన్స్‌ సెంటర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్‌ ప్లానిటోరియం, ఖగోళ ప్రదర్శనను బుధవారం ఆమె ప్రారంభించారు.

జగన్నాథ రథయాత్ర సందర్భంగా పన్నెండు రోజుల పాటు శ్రమించి బంగారంతో పొడవు 11.5 మి.మీ., వెడల్పు 8 మి.మీ., ఎత్తు 12మి.మీ..తో చిన్న రథాన్ని తయారు చేసినట్లు గుణుపురానికి చెందిన విశ్వకర్మ శ్రీకాంత్‌ తెలిపారు. 

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home