చిత్రం చెప్పే విశేషాలు

(24-07-2024)

బాలికలను ప్రోత్సహించి వారు ఉన్నత శిఖరాలకు చేరేలా ప్రోత్సహించాలన్న ముఖ్య ఉద్దేశంతో వరంగల్‌ జిల్లా కాజిపేట ఫాతిమనగర్‌లోని సిద్ధార్థనగర్‌ కూడలిలో ఏర్పాటు చేసిన ప్రతిమలు ఆకర్షణీయంగా ఉన్నాయి. 

సినీ ముద్దుగుమ్మలు ర్యాంపుపై హొయలుపోయారు. చూడముచ్చటైన వస్త్ర శ్రేణిలో మెరిసిపోయారు. హైదరాబాద్‌.. మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో జరిగిన ఫ్యాషన్‌ షోలో సినీ తారలు సంయుక్త మీనన్, ఫరియా అబ్దుల్లా, సిమ్రాన్‌ చౌదరి తదితరులు తళుక్కుమన్నారు.

కాకినాడ జిల్లా కపిలేశ్వరపురం మండలం అద్దంకివారి లంకలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది.  స్థానికులు తెప్పలపై సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణం సాగిస్తున్న దృశ్యం న్యూస్‌టుడే కెమెరాకు చిక్కింది.

ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లాలో గత వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గుసాని, కాశీనగర్, గుమ్మ, పర్లాఖెముండి పట్టణ ప్రాంతాల్లో వరి నాట్లు జోరందుకున్నాయి. మహిళలు ఆనందంగా వరి నాట్లు వేస్తున్నారు. 

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని జవహర్‌నగర్‌లో ఐదో తరగతి చిన్నారి సాయిపౌర్ణిమ పరిసర ప్రాంత చిన్నారులకు పాఠాలు చెప్తోంది. కొత్తగా నిర్మిస్తున్న ఇంటి సిమెంట్‌ పిల్లర్‌ను నల్లబల్లగా మార్చి తనకంటే తక్కువ తరగతి పిల్లలకు హోమ్‌ వర్క్‌ చేయిస్తూ కన్పించింది

ఎగువ ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న వరదతో విశాఖ జిల్లాలోని కోనాం జలాశయం నిండుకుండలా మారింది. సుమారు 400 క్యూసెక్కుల నీరు జలాశయంలోకి వస్తోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 101.25 మీటర్లు కాగా ప్రస్తుతం 99.20 మీటర్ల వరకు నీరుంది. 

పదుల సంఖ్యలో దిష్టిబొమ్మలున్న చిరువ్యాపారి ద్విచక్రవాహనాన్ని జనం ఆసక్తిగా వీక్షించారు. ఓ చిరువ్యాపారి వాటిని ఇంట్లో తయారు చేసుకొని తన ద్విచక్రవాహనంపై భారీగా ఏర్పాటు చేసుకొని ఖమ్మం జిల్లా తల్లాడలోని దుకాణాల వద్దకు వెళ్లి విక్రయించాడు.

తుపాను ప్రభావంతో గత మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా ముసురు పడుతూనే ఉంది. యాదగిరిగుట్టలో నారసింహుడి దర్శనానికి వచ్చిన భక్తులకు వర్షంలో తడిసిన కృష్ణశిలతో నిర్మించిన ఆలయ గోపురాలు, మాడ వీధులు, ప్రాకార మండపాలు, శిల్పాలు కనువిందు చేశాయి.

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కురగల్లు గ్రామంలో ప్రధాన రహదారి గుంతలు పడి ఏళ్లుగా ప్రజలు నరకం చూశారు. ఈ రోడ్డును గత వైకాపా ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది. తాజాగా ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్‌ రూ.2 లక్షలు సొంత నిధులతో రహదారికి మరమ్మతులు చేయించారు.

బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లాలో ఆకాశం మేఘావృతం కావడంతో గుమ్మ సమితి సెరంగో కొండ ప్రాంతాల్లో ప్రకృతి రమణీయంగా కనిపించింది. కొండల మీదుగా వెళుతున్న మేఘాలు, పొగమంచు, చెట్ల పచ్చదనం ఆహ్లాదం పంచింది.  

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home